బీజింగ్: మహమ్మారి కరోనాపై పోరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌ఓ)కు అండగా నిలిచేందుకు 30 మిలియన్ డాలర్ల విరాళం అందజేస్తున్నట్లు చైనా ప్రకటించింది. ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ మేరకు సాయం అందిస్తున్నట్లు గురువారం పేర్కొంది. చైనాలోని వుహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ తీవ్రత గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైనందున.. ఆ సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాదికి 400 నుంచి 500 మిలియన్ డాలర్ల చొప్పున సంస్థకు తాము నిధులు కేటాయిస్తుంటే... చైనా మాత్రం కేవలం 40 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోందని ఆయన విమర్శించారు. అటువంటి దేశానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతుగా నిలిచి ఇంతటి సంక్షోభానికి పరోక్ష కారణమైందంటూ దుయ్యబట్టారు.(డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తున్నాం: ట్రంప్)
ఈ క్రమంలో అంటువ్యాధి ప్రబలుతున్న సమయంలో అమెరికా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని చైనా విజ్ఞప్తి చేసింది. ఇక నిధుల నిలిపివేతపై అమెరికా పునరాలోచన చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అమెరికా నిర్ణయంపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగం చీఫ్ మైక్ ర్యాన్.. నిధుల కొరత సంస్థ ప్రధాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. వివిధ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం తాజాగా 30 మిలియన్ డాలర్లు(అదనంగా) డబ్ల్యూహెచ్‌ఓకు విడుదల చేయడం గమనార్హం.(‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’)
Comments
Please login to add a commentAdd a comment