ప్చ్.. అమ్మాయి పడలేదు!
బీజింగ్: ప్రేమను వ్యక్తం చేయడంలో చైనావాళ్ల స్టైయిలే వేరు. డిఫరెంట్ గా ప్రపోజ్ చేయడంతో చైనీయులు ముందుంటారు. విభిన్నంగా ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఉత్తర చైనాలోని షన్ యాంగ్ నగరానికి చెందిన 27 ఏళ్ల టొంగ్ అయెనన్ కూడా ఈ కోవకు చెందినవాడే. తన డ్రీమ్ గాళ్ కు వెరైటీగా ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ప్రియురాలి ప్రేమను మాత్రం గెలుచులేకపోయాడు
తన పొరుగింటిలో ఉన్న యువతిని టొంగ్ ఇష్టపడ్డాడు. ఆమెకు తన ప్రేమను విభిన్నంగా వ్యక్తం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 840 రూబిక్ క్యూబ్ లతో 20 గంటల పాటు శ్రమించి తనింట్లోనే ప్రేయసి చిత్రానికి ప్రాణం పోశాడు. వెరైటీగా ప్రపోజ్ చేసినా అతడిని ఆమె తిరస్కరించింది. 'రూబిక్ క్యూబ్ లతో తయారు చేసిన ఫొటోను నా డ్రీమ్ గాళ్ కు చూపించి సర్ ప్రైజ్ చేశాను. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను. కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించింది' అని మెకానిక్ గా పనిచేస్తున్న టొంగ్ తెలిపాడు.
ప్రేయసి తిరస్కరించడం పట్ల ఎలా ఫీలవుతున్నావని అడగ్గా... దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని సమాధానమిచ్చాడు. తన డ్రీమ్ గాళ్ ఫొటో తయారు చేసేందుకు 2 నెలల ముందు నుంచి ప్లాన్ వేసుకున్నానని వెల్లడించాడు. 2.1 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించానని చెప్పాడు. ముందుగా ఫొటోషాప్ లో డిజైన్ చేసుకుని దాని ప్రకారం 840 రూబిక్ క్యూబ్ లతో ఈ చిత్రాన్ని తయారుచేశానన్నాడు. డిజైన్ కు అనుగుణంగా రూబిక్ క్యూబ్ ను సరిచేసుకుంటూ, ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క ఫ్రేమ్ లో వీటిని ఒకదానిపై ఒకటి అమర్చానని వెల్లడించాడు. మూడు రాత్రుల్లో 20 గంటల పాటు శ్రమించి దీన్ని రూపొందించానని, ఇందుకోసం 460 డాలర్లు వెచ్చించానని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలు చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.
ఆమె ఎందుకు టొంగ్ ప్రేమను తిరస్కరించిందని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. తన డ్రీమ్ గాళ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని ఆన్ లైన్ జనానికి టొంగ్ విజ్ఞప్తి చేశాడు. ఖాళీ సమయాల్లో రూబిబ్ క్యూబ్ ఆడుకుంటూ ఉంటానని, బయట తిరగడం తనకు అంతగా ఇష్టముండదని తెలిపాడు. రూబిబ్ క్యూబ్ లతో తాను తయారు చేసిన డ్రీమ్ గాళ్ ఫొటోను ఏం చేయాలన్నదే తన ముందున్న 'పజిల్' అని పేర్కొన్నాడు.