ఆంక్షలు మాత్రమే సరిపోవు: చైనా
ఆంక్షలు మాత్రమే సరిపోవు: చైనా
Published Mon, Sep 12 2016 5:14 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
బీజింగ్: ఉత్తర కొరియా తాజా అణు పరీక్షలపై ప్రపంచ దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దీంతో.. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. అయితే, ఉత్తర కొరియాతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడంలో ముందుండే చైనా మాత్రం కేవలం ఈ ఆంక్షలతో ప్రయోజనం ఉండదంటూ చెబుతోంది.
'ఉత్తర కొరియాపై ఆంక్షల విషయంలో చైనా బాధ్యత ఎక్కువ ఉంది' అంటూ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి యష్ కార్టర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా స్పందించింది. కేవలం ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తే సరిపోదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం వెల్లడించారు. ఆంక్షలతో ఉత్తర కొరియా తనంతట తానుగా అణుపరీక్షలను నిలిపివేయదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ముందుగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరముందని చున్యుంగ్ సూచించారు. ఈ విషయంలో అమెరికాకే ఎక్కువ బాధ్యత ఉందని ఆమె స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలో అత్యాధునిక క్షిపణీ వ్యవస్థను అమెరికా మోహరించడం మూలంగానే ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహిస్తోందని చైనా వాదిస్తోంది.
Advertisement