సాక్షి, న్యూఢిల్లీ : జపాన్‌లోని హొక్కాయిడో ద్వీపం మీదుగా వారం రోజుల్లోనే రెండోసారి ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రయోగించి ప్రపంచ దేశాలకు మరోసారి సవాల్ విసిరారు. ఈసారి ఏకంగా హైడ్రోజన్ బాంబునే పేల్చానంటూ ప్రపంచ దేశాలకు పెను సవాల్ విసిరారు. వారం తిరక్కుండానే మరో ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని తిక్క తిక్కగా మాట్లాడారు. అంత ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వస్తోంది? అణ్వస్త్ర అగ్ర దేశాలు కిమ్‌ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నాయి? నిజంగా ఆయన భావిస్తున్నట్లు ఈ దేశాలు కాగితపు పులులేనా?
‘జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక భరించలేం. ఇక యుద్ధమా, శాంతి సామరస్యమా?’ అని ఐక్యరాజ్య సమితిలోని అమెరికా ప్రతినిథి నిక్కీ హేలీ వ్యాఖ్యానించడం అమెరికా ఎంత అసహనానికి గురవుతుందో అద్దం పడుతుంది. ఇక ఉత్తర కొరియాపైకి ఆయుధాలు ఎక్కుపెట్టే అంశం కూడా తమ చర్చనీయాంశంలో ఉందని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ చేసిన తాజా హెచ్చరికలో కూడా అంత బలం కనిపించడం లేదు, ఎందుకని? అమెరికా, చైనా, రష్యా, దక్షిణ కొరియా, జపాన్ ఒక్కటైతే కిమ్ జాంగ్ ఉన్‌ను సప్త సముద్రాల నీళ్లు తాగించవచ్చన్న అంతర్జాతీయ నిపుణుల అంచనాలు తప్పా? ఎప్పటీకీ ఈ దేశాలు తమకు వ్యతిరేకంగా ఒకటికావన్న కిమ్ జాన్ ఉన్ ధీమానా?
ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే నిజం. ఉత్తర కొరియాపై యుద్ధం చేయడానికి చైనా, రష్యాలు పూర్తిగా వ్యతిరేకం. అందుకనే మొన్ననే జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా ఈ రెండు దేశాధినేతలు ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను సామరస్య చర్యల ద్వారా, ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి కాలుదువ్వవద్దని హెచ్చరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేయడం కూడా అమెరికాకు నష్ట దాయకమే. అమెరికాకు చెందిన రెండున్నర కోట్ల మంది ప్రజలు ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణులు లక్ష్యం పరిధిలో ఉన్నారు.
మరో లక్ష మంది అమెరికన్లు ఉత్తర కొరియాలో ప్రస్తుతం ఉన్నారు. యుద్ధం చేయాలంటే వారి ప్రాణాలకు రక్షణ ఉండదన్నది ఓ భయం. యుద్ధానికి భౌగోళికంగా అమెరికాకన్నా ఉత్తర కొరియాకే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఓ పక్క పర్వత ప్రాంతాలు, మరోపక్క సముద్రం. ఆ ప్రాంతాల్లోనే ఉత్తర కొరియా తన అణు ఖండాంతర క్షిపణలను నిక్షిప్తం చేసినట్లు భావిస్తున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఉత్తర కొరియాలోని కొన్ని వ్యూహాత్మక అణ్వాస్త్రాల గురించే తెలుసు.
ఐక్యరాజ్య సమితి ద్వారా మరిన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఉత్తర కొరియాను దారికి తేవాలన్నది అమెరికాతోపాటు దక్షిణ కొరియా, జపాన్ వ్యూహం. ఇప్పటికే కొరియాపై బొగ్గు, కొన్ని రకాల ఖనిజాలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాలపై ఆంక్షలు విధించాలన్నది ఈ మూడు దేశాల డిమాండ్. ఉత్తర కొరియాకు చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న చైనాకు మాత్రం అది ఇష్టం లేదు. ఉత్తరకొరియా విషయంలో ఉపయోగించుకోవడమా, వదిలేసుకోవడమా అన్న ఛాయిస్ తప్పించి చైనాకు మరో అవకాశం లేదు. వదిలేసుకోవాలంటే చమురు ఉత్పత్తులను నిలిపేయాలి. అలా నిలిపేయడమంటే ఆర్థికంగా నష్టపోవడం ఒక్కటైతే, అమెరికా మాటకు తొలొగ్గినట్లు అవుతుందన్నది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆందోళన. ముఖ్యంగా అక్టోబర్ 19వ తేదీ నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అమెరికా మాటకు లొంగారన్న అపవాదు రాకూడదన్నది ఆయన ముందు జాగ్రత్తగా కనిపిస్తోంది.
చైనాను బతిలాడుకోవడమే తప్పించి ఇప్పుడు ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేదు. చైనాను కాదంటే ఆ దేశంతో అమెరికా కొనసాగిస్తున్న 65, 000 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని వదులుకోవాల్సిందే. అందుకు ఆయన సిద్దంగా లేరు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న రష్యా కూడా ఇప్పుడు చైనా వెన్నంటే నడుస్తోంది. ఈ పరిస్థితులు ఆసరాగా తీసుకొనే కిమ్ జాన్ ఉన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కవ్వింపు చర్యలు మితిమీరితే అణు యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని వర్ధమాన దేశాలు భయపడుతున్నాయి. వాస్తవానికి ఉన్ ఉన్నపళంగా ఇలా రెచ్చిపోవడానికి కారణం ఉత్తర కొరియాను అణ్వస్త్ర దేశంగా గుర్తించాన్నదే ప్రధాన డిమాండ్.