ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయి!
* తన చైనా పర్యటనపై మోదీ స్పందన
* మూడు రోజుల పర్యటనకు నేడే శ్రీకారం
* చైనా అధ్యక్షుడి సొంతనగరంలో దిగనున్న భారత ప్రధాని
* సరిహద్దు సమస్యపై డ్రాగన్ నాయకత్వంతో చర్చలు
న్యూఢిల్లీ/బీజింగ్: ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సౌహార్ధ్ర సంబంధాల విషయంలో తన చైనా పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. తన పర్యటనతో భారత్, చైనా సంబంధాలు మరింత విస్తృతమవుతాయన్నారు. చైనాలో ప్రధాని హోదాలో మోదీ 3 రోజుల తొలి పర్యటన కోసం బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా రాజధాని బీజింగ్ నుంచి కాకుండా చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ సొంత నగరమైన గ్జియాన్ (షాంగ్జి రాష్ట్ర రాజధాని) నుంచి మోదీ చైనా పర్యటన ప్రారంభం కావడం విశేషం. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తరువాత బీజింగ్ వెలుపల ఒక విదేశీ నేతకు జిన్‌పింగ్ స్వాగతం పలకడం ఇదే ప్రథమం. భారత పర్యటన సందర్భంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌కు మోదీ ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే.
గ్జియాన్‌లో మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య గురువారం అనధికార చర్చలు జరుగుతాయి. ‘చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత్, చైనాలు కలసికట్టుగా కృషి చేయాల్సి ఉంది.’ అని చైనా అధికార వార్తా సంస్థ సీసీటీవీతో మోదీ వ్యాఖ్యానించారు. చైనా మీడియాను బుధవారం మోదీ కలిశారు. ‘ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం మరింత లోతుగా పాదుకొనడంపైననే ప్రధానంగా దృష్టి పెట్టనున్నాను. అప్పుడే ద్వైపాక్షిక సంబంధాల వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీయడం సాధ్యమవుతుంది.’ అని మోదీ వ్యాఖ్యానించారు. బుద్ధుడు జన్మించిన ఆసియాలో ఈ శతాబ్దాన్ని యుద్ధరహిత శతా బ్దంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
పగోడా సందర్శన: మోదీని ప్రఖ్యాత బౌద్ధ నిర్మాణం పగోడా సందర్శనకు కూడా జిన్‌పింగ్ తీసుకెళ్లనున్నారు. చైనాలో బౌద్ధం వ్యాప్తికి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి జువాన్ జాంగ్స్ చేసిన కృషికి గుర్తుగా క్రీశ 6వ శతాబ్దంలో ఈ పగోడాను నిర్మించారు. చైనా నుంచి చరిత్రాత్మక సిల్క్ రూట్ ద్వారా క్రీశ 645లో జాంగ్స్ భారత్‌కు వచ్చి, 17 ఏళ్లు ఇక్కడే గడిపారు. మోదీ గౌరవార్ధం జిన్‌పింగ్ ఇచ్చే విందు కు ముందు మోదీకి చైనాను పాలించిన తాంగ్ వంశ సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలుకుతారు. గ్జియాన్ నుంచి మోదీ బీజింగ్ వెళ్లి, చైనా ప్రధాని లి కెక్వియాంగ్‌తో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారు.
సరిహద్దు సమస్య: చైనాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్య, పాక్‌కు చైనా అన్ని విధాలుగా అందిస్తున్న సాయం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా నిర్మిస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు..! చైనా, భారత్‌ల సంబంధాలను ప్రభావితం చేసే ఈ అంశాలివి. చైనా నాయకత్వంతో మోదీ బృందం జరిపే చర్చల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాలు ఇటీవలి కాలంలో కృషి చేస్తున్నప్పటికీ.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్సాయిచిన్ ప్రాం తంలోని 2 వేల కిమీలకే సరిహద్దు సమస్య పరిమితమని చైనా వాదిస్తుండగా, 1962 యుద్ధం సమయంలో చైనా ఆక్రమించుకున్న పశ్చిమ ప్రాంతంలోని 4 వేల కిమీలు సమస్యాత్మకమేనని భారత్ పేర్కొంటున్నది. కాగా, భారత్‌తో సరిహద్దు సమస్య ఒక్కరోజులో పరిష్కారమయ్యేది కాదని చైనా పేర్కొంది.
మోదీ పాల్గొనే కార్యక్రమాలు
- బీజింగ్‌లో భారత్, చైనాల రాష్ట్రాధినేతల సమావేశంలో మోదీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌ల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ఆనందిబెన్ పటేల్‌లు పాల్గొంటారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆయన పర్యటన రద్దయింది.
- టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద యోగా-తాయిల సమ్మిళిత కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు. సింఘ్వా యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. షాంఘైలో వ్యాపార సంస్థలసీఈఓల భేటీలో పాల్గొంటారు.
మంగోలియాలో..
- మే 17న మంగోలియా చేరుకుంటారు. అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు.
- మంగోలియా అధ్యక్షుడు సఖియాగ్జిన్ ఎల్బెగ్‌డోర్జ్‌తో చర్చలు జరుపుతారు.
- చివరగా, మంగోలియా నుంచి దక్షిణ కొరియా వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు పార్క్ గ్వెన్‌హైతో చర్చలు జరుపుతారు.