చైనా నైజం మారలేదు | Shiv Sena takes dim view of Modi's China visit | Sakshi
Sakshi News home page

చైనా నైజం మారలేదు

Published Mon, May 18 2015 11:48 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

చైనా నైజం మారలేదు - Sakshi

చైనా నైజం మారలేదు

- ముందు మంచిగా నటిస్తూ..వెనకాల గోతులు తవ్వుతోంది
- అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ లేని భారత పటం చూపడంపై మండిపడ్డ సేన
- టిబెట్ లేని చైనా పటాన్ని చూపిస్తే సహిస్తారా అని ప్రశ్న
- సియాచిన్‌పై చైనా ఓ కన్నేసి ఉంచిందని హెచ్చరిక
- చైనాకు వ్యతిరేకంగా మాట్లాడిన తొలి ప్రధాని మోదీ అని ప్రశంస
ముంబై:
చైనా వైఖరిని శివసేన తప్పుపట్టింది. ముందుకు మంచిగా నటిస్తూ వెనకాల గోతుల తవ్వుతోందని  తీవ్రంగా విమర్శించింది. ఓ వైపు ప్రధాని మోదీకి చైనా ఘన స్వాగతం పలుకుతూనే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ లేని భారత పటాన్ని చూపించి చైనా తమ నైజాన్ని మరోసారి బయటపెట్టిందని మండిపడింది. మోదీ చైనా పర్యటన లో ఉన్నప్పుడు ఆ దేశానికి చెందిన ఓ టెలి విజన్ మీడియా సంస్థ అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్‌లేని భారతదేశ పటాన్ని చూపిం చింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని సేన పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా పేర్కొనడమే కాకుండా జమ్మూ-కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరిస్తోందని మండిపడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనలో ఉన్నప్పుడు టిబెట్ లేని చైనా చిత్రపటాన్ని చూపించినట్లయితే చైనా ప్రజలు సహిస్తారా అని ప్రశ్నించింది. ఆ విధంగా చేసే ధైర్యం మనకు లేదని వ్యంగ్యంగా పేర్కొంది. చైనా పాక్‌ను కట్టడిచేయలేకపోతే తాము పాక్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడ జిన్‌పింగ్‌కు తెలిపాడని చెప్పింది.

లక్షల హెక్టార్ల భూమి నష్టపోయాం
పాక్‌కు చైనా మందుగుండు సామాగ్రి, అణ్వాయుధాలు, డబ్బు తదితర అంశాల్లో సహాయం చేస్తోందని పేర్కొంది. పాకిస్తాన్‌లో టైజం తప్ప ఏమీలేదని, ప్రతి విషయానికి చైనా పైన ఆధారపడుతోందని చెప్పింది. 1962లో మనం ‘హిందీ-చైని’ భాయి భాయి అంటే..అకస్మాత్తుగా చైనా మనపై దాడి చేసిం దని, ఆ దాడిలో మన దేశం లక్షల హెక్టార్ల భూమిని కోల్పోయిందని గుర్తుచేసింది. ఇప్పటికీ చైనా సియాచిన్‌పై ఓ కన్నేసి ఉంచిందని చెప్పింది. ముడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ మే 14న చైనా వెళ్లారు. ఇందులో భాగంగా ఇరుదేశాల సరిహద్దు వివాదంలో రాజకీయ పరిష్కారానికి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ట్రాన్స్ హార్బర్ లింక్ నిర్మాణంలో చైనా టెక్నాలజీ
ముంబై, నవీముంబైలను సముద్రపు లింకుతో కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చైనా టెక్నాలజీ ఉపయోగించే విషయంలో ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. షాన్‌డాంగ్-మహారాష్ట్ర పరస్పర ఆర్థిక సహకారం దిశగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అన్నారు. ట్రాన్స్ హార్బర్ నిర్మాణంలో చైనా టెక్నాలజీని వాడుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి ఈ ఒప్పందంలో ముఖ్యమైనవని సీఎం ట్వీట్ చేశారు. నవీముంబైలోని సెవ్రీ-చిర్లీ మధ్య ఏర్పాటు చేస్తున్న 22 కిలోమీటర్ల సీలింక్ ముంబై, నవీ ముంబైల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు నుంచి ముంబైకి వచ్చే ట్రాఫిక్‌ను కొంత వరకు తగ్గిస్తుంది.  
 
శభాష్ మోదీ
మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శ అస్త్రాలు సంధించిన శివసేన అకస్మాత్తుగా ప్రశంసలతో ముంచెత్తడం ప్రారంభించింది. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై సేన సామ్నా సంపాదకీయంలో పొగడ్తలతో ముంచెత్తింది. చైనా-భారత్ సరిహద్దుపై జరుగున్న వివాదం తెలిసి కూడా ఇంతవరకు ఏ ప్రధాని నొరు విప్పలేదని, కాని  చైనా నేలపై అడుగుపెట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంది.  నమ్మకద్రోహులతో జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. బలమైన ప్రధాని ఉండగా చింతించాల్సిన అవసరం లేదని కొనియాడింది. భూసేకరణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు తదితర అనేక అంశాలపై బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన శివసేన సోమవారం సామ్నా పత్రికలో మోదీని ప్రశంసించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement