ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మరాఠా కోటా గురించి చర్చించేందుకు ప్రధాని మోదీతో భేటీ అయిన రెండు రోజుల్లోనే సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2019 ఎన్నికల వేళ బీజేపీ, శివసేనల మధ్య విబేధాలు తలెత్తడం.. మిత్రులిద్దరు విడిపోవడం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఠాక్రే-మోదీల భేటీపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో శివసేన తాము వ్యక్తిగత సంబంధాలకు అత్యంత విలువ ఇస్తామని, రాజకీయంగా చూడమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడానికి ముందుండే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనను ఆకాశానికెత్తేశారు. మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలోనే కాక.. బీజేపీలో కూడా టాప్ లీడర్ అని సంజయ్ రౌత్ ప్రశంసించారు.
పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర నేతలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు, మోదీ ఛరిష్మా తగ్గినట్లేనా.. అన్న మీడియా ప్రశ్నకు సంజయ్ రౌత్ ఈ సమాధానమిచ్చారు. ‘‘మీడియాలో వస్తున్న వార్తలను నేను చూడలేదు. అధికారికంగా కూడా ఎక్కడా ఇలాంటి నిర్ణయం వెలువడలేదు. మోదీ దేశంలోనే టాప్ లీడర్. బీజేపీలో కూడా’’ అని వ్యాఖ్యానించారు. గత 7 సంవత్సరాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక మోదీ కృషి ఉందని, బీజేపీలోనూ మోదీ టాప్ అని రౌత్ కొనియాడారు.
అయితే ప్రధాని అన్న హోదా మొత్తం దేశానికి సంబంధించినదని, ఒక పార్టీకి చెందినది కాదన్నారు సంజయ్ రౌత్. అందువల్ల మోదీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని ఆయన సూచించారు. ప్రధాని మోదీ తలుచుకుంటే శివసేనతో కలిసి పోటీ చేస్తారన్న బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై రౌత్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘పులితో (శివసేన గుర్తు) ఎవరూ స్నేహం చేయలేరు. తనతో స్నేహం చేయాలో పులే నిర్ణయించుకుంటుంది’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
చదవండి: ‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’
Comments
Please login to add a commentAdd a comment