నిషేధంతో చైనా గుబులు | China Worried About India Ban On China Apps | Sakshi
Sakshi News home page

నిషేధంతో చైనా గుబులు

Published Wed, Jul 1 2020 5:00 AM | Last Updated on Wed, Jul 1 2020 7:20 AM

China Worried About India Ban On China Apps - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయనే కారణంతో భారత ప్రభుత్వం 59 యాప్‌లపై నిషేధం విధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. చైనా యాప్‌లపై విధించిన నిషేధంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ మాట్లాడుతూ.. ‘యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై చైనా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. భారత ప్రభుత్వ నిర్ణయంతో తలెత్తిన పరిస్థితులను గమనిస్తున్నాం.

అంతర్జాతీయ నిబంధనలు, స్థానిక చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చైనా ప్రభుత్వం చైనా వ్యాపార సంస్థలను ఎల్లప్పుడూ కోరుతోంది. చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన, చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది’అని తెలిపారు. భారత్, చైనాల మధ్య ఆచరణాత్మక సహకారం వాస్తవానికి రెండు దేశాలకూ మేలు చేసేదే. అటువంటి సహకారంలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం భారత్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగించవు’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తర్వులకు లోబడి నడుచుకుంటాం
టిక్‌టాక్‌ యాప్‌ను బ్లాక్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆ సంస్థ స్పందించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని, తమ యాప్‌ భారతీయ వినియోగదారుల సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి చేరవేయలేదని తెలిపింది. వినియోగదారుల సమాచార గోప్యతకు కట్టుబడి ఉన్నామంది. ప్రభుత్వ సంస్థల ఆహ్వానం మేరకు సమాధానం, వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ చెప్పారు. గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ ప్లే స్టోర్‌ నుంచి తమ యాప్‌ను టిక్‌టాక్‌ సంస్థ తొలగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement