జైలు బయట పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఖైదీల బంధువులు
సావోపాలో: బ్రెజిల్‌లోని అమెజొనాస్ రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 17 మైళ్ల దూరంలో ఉన్న ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి 15 మంది చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇది జైలులోని ఖైదీల మధ్య ఘర్షణేనని కల్నల్ మార్కోస్ వినిసియస్ విలేకరులకు చెప్పారు. పళ్లు తోముకునే బ్రష్‌లను పదునుగా చేసి, వాటితో పొడుచుకున్నారనీ, మరికొందరిని గొంతునులిమి చంపేశారని అధికారులు తెలిపారు. ఘటనకు కారణం కనుగొనేందుకు విచారణను ప్రారంభించారు. అధికారులు తక్షణం స్పందించి గొడవను అదుపు చేశారనీ, లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని కల్నల్ చెప్పారు.
2017 జనవరిలోనూ ఇదే జైలులో ఖైదీలు తిరుగుబాటు చేయగా, పరిస్థితిని అదుపు చేసేందుకు దాదాపు 20 గంటలు పట్టింది.నాటి తిరుగుబాటులో 56 మంది చనిపోయారు, 184 మంది ఖైదీలు పారిపోయారు. జైళ్లలో జనం అధికంగా ఉండే దేశాల్లో ప్రపంచంలో బ్రెజిల్‌ది మూడోస్థానం. జైళ్ల సామర్థ్యానికి రెండింతల మంది ఖైదీలు వాటిలో ఉంటున్నారు. ఇక్కడి జైళ్లలో ముఠా హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు చాలా ఎక్కువ. గతేడాది సెప్టెంబర్‌లో కొందరు దుండగులు భారీ ఆయుధాలతో వచ్చి జైలు గేటు బయట పేలుళ్లు జరిపి అనంతరం లోపలకు చొరబడి ఓ పోలీస్ సిబ్బందిని చంపి, 92 మంది ఖైదీలను విడిపించుకుని వెళ్లగా, వారిలో సగం మందిని ప్రభుత్వం మళ్లీ పట్టుకుంది. మాదకద్రవ్యాల ముఠా నేతలు బ్రెజిల్ జైళ్లలో ఎక్కువగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment