
బొద్దింకలతో భలే వ్యాపారం..
బీజింగ్: బొద్దింక కనిపించడం ఆలస్యం కొందరు వెంటనే దాన్ని చంపేస్తుంటారు. కానీ, యూన్‌మెక్సియా అనే 37 ఏళ్ల చైనా మహిళ మాత్రం మురిపెంగా బొద్దింకలను పెంచుతుంది. అలా ఒకటీ, రెండూ కాదు లక్ష బొద్దింకలు ఆమె ఇంట్లో పెరుగుతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని సికియాన్ కౌంటీలో ఉండే మెక్సియా బొద్దింకలను పెంచుతూ వాటిని ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటోంది. ఈమె పెంచే బొద్దింకలను మందుల తయారీలో వాడుతుంటారు.
దీంతో వాటిని కేజీ 100 డాలర్లు (5,900 రూపాయలు) చొప్పున విక్రయిస్తూ తాను అచ్చమైన వ్యాపారవేత్తనని మెక్సియా నిరూపించుకుంటోంది. బొద్దింకలను ముందుగా నీటిలో ముంచి వాటి ప్రాణాలను తీసిన తర్వాత సూర్యరశ్మికి ఎండబెట్టి, ప్యాక్ చేసి ఫార్మా కంపెనీలకు పంపుతూ ఉంటుంది. తన దగ్గర బొద్దింకలు కొన్ని రోజులే ఉన్నా... వాటిని సొంత పిల్లల్లా చూసుకుంటానని మెక్సియా చెబుతోంది. రోజంతా బొద్దింకలను పెంచే ఇంట్లోనే గడిపి, ఏ రాత్రో తన ఇంటికి వెళ్లడం ఆమె దినచర్య.