ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) మరో దేశానికి వ్యాప్తి చెందింది. శ్రీలంకలో మొదటి కరోనా కేసు నమోదు అయ్యినట్లు ఆ దేశం ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన పర్యటకులను సంప్రదించిన 52 ఏళ్ల టూరిస్ట్ గైడ్‌కు కరోనా సోకినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వ్యక్తిని ఉత్తర కొలంబోలో ఉన్న ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. (కరోనా బారిన ఆరోగ్య మంత్రి)
వృత్తి రీత్యా టూరిస్ట్ గైడ్ అయిన వ్యక్తి ఇటాలియన్ పర్యాటకుల బృందంతో కలిసి పనిచేసిన అనంతరం వైరస్ బారిన పడినట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కార్యాలయం తెలిపింది. అలాగే దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇటలీ పర్యటకులు ఏయే ప్రదేశాలను సందర్శించారనే దానిపై శ్రీలంక అధికారులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా .. చైనా, సౌదీ అరేబియా నుంచి వచ్చే విమానాలను శ్రీలంక ఎయిర్‌లైన్స్ నిలిపివేసింది. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్ నుంచి వచ్చిన వారిని నిర్భంధించడం ప్రారంభించింది. (కరోనా ఎఫెక్ట్ : మాస్క్‌తో చాహల్)
ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా 4,250 మందిని బలి తీసుకుంది. అలాగే దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. భయంకర కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటివరకూ సంభవించిన మరణాల సంఖ్య 3,136కు చేరగా.. ఇటలీలో 10 వేల మందికి వ్యాప్తి చెందగా ఇప్పటి వరకు 631 మంది మరణించారు. మరోవైపు కోవిడ్–19 బారిన పడిన వారి సంఖ్య భారత్‌లో 60కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment