న్యూఢిల్లీ : నల్ల జాతీయులు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని భావిస్తాం. వారు ఆకలి బాధతో తపించి, రోగాల బారిన పడి అంత త్వరగా చనిపోరనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే కరోనా వైరస్ బారిన పడిన వారిలో శ్వేత జాతీయులకన్న నల్ల జాతీయులే ఎక్కువగా మరణిస్తున్నారట. ఇంగ్లండ్, వేల్స్‌లో నల్ల జాతీయుల్లో పురుషులు శ్వేతజాతీయులకన్నా 4.2 రెట్లు ఎక్కువ, అదే నల్లజాతీయులైన మహిళలు 4.3 రెట్లు ఎక్కువగా మరణిస్తున్నారని ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్)’ తెలియజేసింది. శ్వేత జాతీయులకన్నా బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత జాతికి చెందిన వారు ఎక్కువగా మరణిస్తున్నారని ఓఎన్‌ఎస్ పేర్కొంది. మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేది మధ్యన బ్రిటన్‌లో సంభవించిన మరణాలను జాతుల వారిగా విశ్లేషించడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్‌ఎస్ తెలిపింది. (‘లాక్‌డౌన్‌లో కూడా ప్రమాదాల రేటు మారలేదు’ )
ఓఎన్‌ఎస్ ప్రకారం.. ఎక్కువ మరణాలకు కారణం కొంత మేరకు వారి సామాజిక, ఆర్థిక వెనకబడిన తనం కాగా, అంతుచిక్కని ఇతర కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆరోగ్యం, వైకల్యం లాంటి ఇతర కారణాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినప్పటికీ శ్వేత జాతీయులకన్నా నల్ల జాతికి చెందిన స్త్రీలు, పురుషులు 1.9 రెట్లు ఎక్కువగా మరణించే అవకాశం ఉందని ఓఎన్‌ఎస్ అధ్యయనంలో తేలింది. అందుకే నల్ల జాతీయులతోపాటు నిమ్న జాతీయులే ఎక్కువగా మరణించడానికి దారితీస్తున్న కారణాలపై దర్యాప్తు జరపాల్సిందిగా ‘బ్లాక్ అండ్ మైనారిటీ ఎత్నిక్ (బీఏఎంఈ)’ జాతులు డిమాండ్ చేస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. నేషనల్ హెల్త్ స్కీమ్ (ఎన్‌హెచ్‌ఎస్)లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందిలో కరానో బారిన పడి 72 శాతం మంది బీఏఎంఈ జాతీయులే ఎందుకు మరణించారని ఆ జాతులు ప్రశ్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment