బీజింగ్: చైనా నుంచి ఇప్పటికే 11 దేశాలకు విస్తరించిన ప్రాణాంతకమైన ‘కరోనా’ జాతి వైరస్ 18 నెలలోనే ప్రపంచంలోని అన్ని మూలలకు విస్తరిస్తుందని, దీని వల్ల దాదాపు ఆరున్నర కోట్ల మంది మరణించే ప్రమాదం ఉందని అమెరికాలోని ప్రతిష్టాకరమైన ‘జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ’ ముందుగానే హెచ్చరించింది. చైనాలో కరోనావైరస్ బయట పడడానికి రెండు నెలల ముందు, అంటే గత అక్టోబర్ నెలలోనే ఇలాంటి ప్రాణాంతక వైరస్ ఎన్ని నెలల్లో ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది ? ఎంత మంది మరణిస్తారు? అన్న అంశంపై కంప్యూటర్ సిములేషన్ ద్వారా అంచనా వేయగా ఈ విషయం తేలింది.
ఇప్పటి వరకు కరోనా జాతి వైరస్ వల్ల చైనాలో 41 మంది మరణించగా, 1200 మంది అస్వస్థులయ్యారు. ‘డిసెంబర్ నెలలో, చైనాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి తెలియగానే నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. మేము ముందుగా అంచనా వేసినట్లుగానే అక్కడ కరోనావైరస్ వ్యాపించింది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని తెలుసు. ఎంత తీవ్రంగా అన్నదాన్ని ఇంకా అంచనా వేయలేదు. ఇది సార్స్‌కంటే ఎక్కువ విస్తరిస్తుంది’ జాన్స్ హాప్కిన్స్ సెంటర్‌లోని సీనియర్ పరిశోధకులు డాక్టర్ ఎరిక్ టోనర్ హెచ్చరించారు. 2003లో చైనాలో సార్స్ వల్ల ఎనిమిది వేల మంది అస్వస్థులు కాగా, 774 మంది మరణించారు. సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) కూడా ఒక రకమైన కరోనా వైరస్ నుంచే వ్యాపించింది.
కరోనా వైరస్ శ్వాస క్రియ వ్యవస్థను దెబ్బతీస్తుందని, నిమోనియా లక్షణాలతో రోగులు మరణించే ప్రమాదం ఉందని డాక్టర్ ఎరిక్ అభిప్రాయపడ్డారు. గబ్బిలం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని చైనా వైద్యులు ముందుగా అనుమానించగా, సీఫుడ్ సెంటర్‌లో విక్రయించే పాముల నుంచి వ్యాపించి ఉండవచ్చని ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారి కళ్లలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కళ్ల నుంచి కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించ వచ్చని, అందుకు సురక్షితంగా అందరు కళ్లజోళ్లు పెట్టుకోవాలని కూడా చైనా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారు మాత్రం స్పేస్ సూట్లు తరహాలో ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఓ వైద్యుడు వైరస్ సోకి మరణించారు. ఇప్పటికే ఈ వైరస్ అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, సింగపూర్, హాంకాంగ్, మకావు, నేపాల్ దేశాలకు విస్తరించింది.
చదవండి: చైనాలో కరోనా కల్లోలం
Comments
Please login to add a commentAdd a comment