న్యూఢిల్లీ : 2011లో వార్నర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విడుదలైన హాలివుడ్ చిత్రం ‘కంటేజియన్’ ఇప్పుడు మళ్లీ మన కళ్ల ముందు కదలాడుతోంది. మట్ డామన్, కేట్ విన్‌స్లెట్ నటించిన ఆ చిత్రానికి ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో చైనాలోని ఓ గబ్బిలం నుంచి విస్తరించిన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతారు. దాన్ని అరికట్టేందుకు ప్రపంచంలోని రోగ నియంత్రణ, నిరోధక కేంద్రాలు తీవ్రంగా కృషి చేస్తాయి. చివరకు అందులో ‘పేషంట్ జీరో’గా పిలిచే ఓ చెఫ్‌కు ఈ వినూత్న వైరస్ సోకుతుంది. ఆ వైరస్‌తో పోరాడి బతికి బట్టకట్టడం ద్వారా పేషంట్ జీరో హీరో అవుతారు. ఆ పాత్రను నిర్మాతల్లో ఒకరైన మట్ డామన్ పోషించారు.
అచ్చం అందులో లాగానే చైనాలోని వుహాన్ పట్టణం నుంచి విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల చైనాలో 26 మంది మరణించగా 800 మంది అస్వస్థులయ్యారు. అమెరికాలో ఆరుగురికి ఈ వైరస్ సోకింది. భారత్‌లోని కేరళకు చెందిన ఓ నర్సుకు కూడా ఈ వ్యాధి సోకినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో ఆ వైరస్ లక్షణాలు కనిపించలేదని డాక్టర్లు ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. చైనాలో ఈ వైరస్ సోకిన వారు ఎక్కడి వారక్కడ ఉన్న ఫళంగా రోడ్ల మీద, బస్టాపుల్లో పడిపోతున్నారు. దాంతో భయకంపితులవుతున్న చైనీయులు తండోపతండాలుగా ఆస్పత్రులకు వెళుతున్నారు. వారి తాకిడిని తట్టుకోవడం వైద్యాధికారులకు తలకు మించిన భారమైంది.
సినిమాలోలాగా కరోనా వైరస్ చైనాలోని గబ్బిలం నుంచే వెలువడి ఉంటుందని, ఆ దిశగా పరిశోధనలు జరపాలని నాటి ‘కంటేజియన్’ అభిమానులు చైనా వైద్యులకు సలహా ఇస్తున్నారు. ఆ సినిమాలోని పేరును చూసే ఇప్పటి వైరస్‌కు కూడా ‘కరోనా’ అని పేరు పెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. ‘కంటేజియన్’ సినిమా అత్యంత భయానకమైనదని గత కొన్నేళ్లుగా తాను చెబుతున్నానని, ఇప్పుడదే నిజమైందని నటుడు, దర్శకుడు స్టీఫోన్ పోర్డ్ ట్వీట్ చేశారు. ‘నాకు కంటేజియన్ సినిమా గుర్తొస్తోంది. అచ్చం సినిమాలోలాగానే ఇప్పుడు చైనాలో వైరస్‌కు రోగులు చనిపోతున్నారు. చైనా గబ్బిలాల విసర్జితాలను ఎరువులుగా వాడుతుండడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందివుండొచ్చు’ అని మరొకరు ట్వీట్ చేశారు. గబ్బిలం జిగురు నుంచి తయారు చేస్తున్న సబ్బుల వల్ల కూడా ఈ వైరస్ సోకవచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. 2003లో హాంకాంగ్‌లో ‘సార్స్’ వైరస్‌తో అనేక మంది మరణించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2011లో కంటేజియన్ చిత్రం తీసి ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకనే ఆ సినిమాలో వైరస్ చైనా నుంచి విస్తరించిందని చూపించారు. కల్పితం అయినప్పటికీ సినిమాలో సైన్స్‌ను సైన్స్‌లా చూపించారని ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ‘స్లీవెన్ సోడర్‌బెర్గ్’ను నాటి సైన్స్ కమ్యూనిటీ ప్రశంసించింది.
అచ్చం ఆ సినిమా తరహాలోనే చనిపోతున్నారు!
Published Fri, Jan 24 2020 6:09 PM | Last Updated on Fri, Jan 24 2020 6:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment