
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : ప్రపంచ ఆర్థికవ్యవస్థలపై కరోనా కల్లోలం రేపుతోంది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు పాటిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి అమెరికాలో ఊహించని రీతిలో విస్తరించడం మరింత ఆందళన రేపుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న కేసులు, రికార్డు స్థాయి మరణాలతో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికాకు ఈ పరిణామం అశని పాతంలా తగిలింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ హెచ్ పావెల్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ భయంకరమైన వేగంతో పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో ఉంది. ఊహించని వేగంగా పతనమవుతోందని పేర్కొన్నారు. అయితే, సంక్షోభం ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా కోలుకుంటుందని జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)
ఆర్థిక మందగమనం, లాక్ డౌన్ కష్టాల నేపథ్యంలోనే చిన్న వ్యాపారాలు, పెద్ద కంపెనీలకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సహాయం అందించడానికి ఫెడ్ ఇటీవల కొత్త ప్యాకేజీని ప్రకటించినట్టు ఫెడ్ ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ సమయాల్లో ఇటువంటి అత్యవసర చర్యలు తప్పవని ఫెడ్ పేర్కొంది. మరోవైపు అమెరికాలో 17 మిలియన్లకు పైగా ప్రజలు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. కాగా అమెరికాలో న్యూయార్క్ కేంద్రంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 2100 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది. కరోనా కారణంగా మరణించిన వాళ్ళను పబ్లిక్ పార్క్ లలో సామూహికంగా ఖననాలు చేస్తున్నారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.