
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను(కోవిడ్) ఎదుర్కోనేందుకు ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇజ్రాయిల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉగ్రవాదులను పసిగట్టేందుకు వాడే సాంకేతికను కరోనా నిర్మూలనకు ఉపయోగించనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూ పేర్కొన్నారు. బెంజిమన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి తగ్గే వరకు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలలో కరోనా లక్షణాలను గుర్తించేందుకు సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తామని పేర్కొన్నారు.
కరోనా నిర్మూలనలో భాగంగా ఆదివారం నుంచి అన్ని మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్స్ మూసివేయనున్నట్లు తెలిపారు. అవసరమనుకుంటే తప్ప ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లవద్దని కోరారు. అయితే ప్రజలకు అత్యవసరంగా ఉపయోగపడే పార్మసీ, సూపర్‌మార్కెట్, బ్యాంక్‌లు ఎదావిదిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయని అన్నారు. కాగా, ప్రజలెవరూ గుంపులుగా ఉండొద్దని, ఒక రూంలో కేవలం పది మంది వరకే ఉండాలని అక్కడి వైద్య అధికారులు సూచిస్తున్నారు.