జెనీవా: మహమ్మారి కరోనా విషయంలో యువతకు నిర్లక్ష్య ధోరణి తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు పలికింది. కరోనా బారిన పడుతున్న వారు.. ప్రాణాలు కోల్పోతున్నవారిలో వయసుపైబడిన వారే అధికంగా ఉన్నప్పటికీ యువత అతీతం కాదని తెలిపింది. కరోనాను తక్కువ అంచనా వేసి ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ హెచ్చరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వేలాది యువకుల పరిస్థితి మరిచిపోవద్దని చెప్పారు. కోవిడ్-19 ను ఎదుర్కోవాంటే.. రెండు జనరేషన్లవారు సంఘీభావంతో పనిచేయాలని, అప్పుడే వైరస్‌ను దీటుగా ఎదుర్కోవచ్చని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వెల్లడించారు.
(చదవండి: కరోనా కట్టడికి... స్వచ్ఛంద యుద్ధం)
ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు..
‘ప్రపంచ యువతకు ఈరోజు ఒక సందేశాన్ని ఇవ్వదల్చుకున్నా. వైరస్‌కు మీరు అతీతులు కాదు. వైరస్ మమ్మల్ని ఏమీ చేయలేదనే భావనలో ఉండొద్దు. అది మిమ్మల్ని కొన్ని వారాలపాటు ఆస్పత్రిలో ఉంచొచ్చు. లేదంటే ప్రాణాలే తీయొచ్చు. మీకు అనారోగ్యంగా లేకపోయినా.. ఎక్కడపడితే అక్కడకు తిరగొద్దు. ఇతరుల ప్రాణాలను రిస్కులో పెట్టొద్దు. అయితే, చాలా మంది సూచనలు పాటిస్తున్నారని నమ్ముతున్నాను. సంతోషం’అన్నారు. ఇక చైనాలో కొత్తగా నమోదవుతున్న కేసులు పూర్తిగా పడిపోయానని ఆయన తెలిపారు. వైరస్ కేంద్ర స్థానంగా భావిస్తున్న వుహాన్ నగరంలో గడిచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం నిజంగా విజయమేనని చెప్పారు.
(చదవండి: 22న జనతా కర్ఫ్యూ)
కోవిడ్‌పై చైనా సాధించిన విజయంతో ప్రపంచ దేశాలూ వైరస్‌ను ఎదుర్కోవచ్చేనే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. అయితే, చైనాలో పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని నమ్మే వీలు లేదని, అక్కడ మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అల్పదాయా దేశాలు.. పోషకార లోపంతో బాధపడుతున్న దేశాల్లో కోవిడ్ నష్టాలు పెద్ద మొత్తంలో ఉంటాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి దేశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారికి వైరస్ సోకితే.. పరిస్థితి విషమంగా మారే వీలుందని చెప్పారు. అయితే, ‘చరిత్రలో పెను విషాదాన్ని నింపిన మహమ్మారిల్లా కాకుండా, ఈ వైరస్ వెళ్లే దారిని మార్చగల శక్తి మాకు ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్‌లో సమాచారం..
కష్టకాలంలో మానసిక ఆందోళన, భయాందోళనలకు గురవడం సహజమని టెడ్రోస్ అన్నారు. అలాంటి వారితో మాట్లాడి ధైర్యం నింపండని అన్నారు. పొగ తాగేవారికి వైరస్ సోకితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజల్ని అప్రమత్తం చేయడానికి వాట్సాప్‌లో ప్రజలకు సమాచారం అందిస్తామని చెప్పారు. దానికోసం.. 0041 798 931 892 నెంబర్‌కు ‘హాయ్’ అని ఇంగ్లిష్‌లో మెసేజ్ చేస్తే చాలు రిప్లై వస్తుందని తెలిపారు. వచ్చేవారం నుంచి ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ఇస్తామని అన్నారు.
భౌతిక దూరం..
ఇటలీలో కోవిడ్ సోకిన ప్రతి ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ అన్నారు. వారంతా 70 ఏళ్ల లోపు వారేనని తెలిపారు. సామాజిక దూరాలు కాకుండా.. ప్రజలంతా భౌతికంగా దూరం పాటించాలని ఆయన సూచించారు. ఇది వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుని ఫిజికల్ ఐసోలేషన్‌కు వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మానిసికంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. భౌతికంగా మాత్రమే కాకుండా.. ఇంకా చాలా మార్గాల్లో ప్రజలతో సంబంధాలు కొనసాగించొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జింగ్ డీసీజెస్ యూనిట్ చీఫ్ మరియా వాన్ కెర్కోవ్ పేర్కొన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 50 వేల మంది కోవిడ్ బారిన పడగా.. 11 వేల మంది మృతి చెందారు.
(చదవండి: ‘నేను కరోనా బారిన పడ్డాను.. కానీ!’)
Comments
Please login to add a commentAdd a comment