దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ (పాత చిత్రాలు)
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్‌కు షాక్ తగిలింది. అతని ఒక్కగానొక్క కొడుకు ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులేయడంతో అరవయ్యేళ్ల పైబడ్డ షకీల్‌కు ఏమీ పాలుపోవడం లేదు. షకీల్ కొడుకు ముబషీర్ షైక్ (18) పవిత్ర ఖురాన్‌లో ఉన్న 6236 పద్యాలు కంఠస్తం పట్టడంతో ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. ముబషీర్ ‘హఫీజ్ ఎ ఖురాన్’గా మారాడనీ, కరాచీలోని ఓ మసీదులో ప్రజలకు ఖురాన్‌ను బోధిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కొడుకు వ్యవహారంతో షాక్ తగలగా..ఆయన అనుచరుడు ఛోటా షకీల్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది.
దావూద్ కొడుకు మోయిన్ నవాజ్ (31) ఇస్లాం మత ప్రబోధకుడి (మౌలానా)గా మారడంతో అతను డిప్రెషన్‌కు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దావూద్, అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ కొడుకు కూడా ఆధ్యాత్మిక జీవితానికే మొగ్గుచూపడంతో ముంబై అండర్‌వరల్డ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో డీ-గ్యాంగ్ సృష్టించిన కోట్ల రూపాయల అధో ప్రపంచానికి వారసుడు కరువయ్యాడని కొందరు చెప్తున్నారు. కాగా, ముబషీర్ అంటే మంచి వార్తలు మోసుకురావడం అని అర్థం. దావూద్ కొడుకు స్ఫూర్తితో ముబషీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment