దావూద్ పరిస్థితి విషమం!
కరాచీ: మాఫియా డాన్, ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం చావుబతుకుల్లో ఉన్నాడా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. దావూద్ కాళ్లలో గ్యాంగ్రీన్(శరీరభాగం కుళ్లడం)తో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స చేస్తున్న వైద్యులు కూడా గ్యాంగ్రీన్ చివరిదశలో ఉన్నట్లు తేల్చి చెప్పేశారట.కరాచీలోని లియాఖత్ జాతీయ ఆస్పత్రిలో అతనికి సైనిక ఆస్పత్రి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. సీఎన్‌ఎన్-న్యూస్ 18 తాజా కథనం ప్రకారం గ్యాంగ్రీన్ చివరి దశలో ఉందని, దావూద్ మరణించే అవకాశముందని వైద్యులు చెప్పారు.
అధిక రక్తపోటు, మధుమేహం వల్ల దావూద్ కాళ్లలోని రక్తసరఫరాలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయని, కాళ్లకు ఆక్సిజన్ అందక కణజాలం కుళ్లిపోతోందని తేల్చారు. గ్యాంగ్రీన్ వల్ల ఉత్పత్తయ్యే విషపదార్థాలు శరీరమంతా కూడా వ్యాపించే అవకాశముందంటున్నారు. కాళ్లు తీసేయడం తప్ప ప్రస్తుతం వేరే ప్రత్యామ్నాయం లేదని వైద్యులు భావిస్తున్నారట. ఐఎస్‌ఐ రక్షణ కింద ఉన్న దావూద్‌ను కరాచీ నుంచి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ దావూద్ పాక్‌లో చనిపోతే అతన్ని రప్పించేందుకు భారత్ చేస్తున్న కృషి వృథా అయినట్లే.