ఆ వీడియోలతో జాగ్రత్త!
ఢిల్లీ: మీరు ఓ ఎత్తైన కొండ అంచున నిల్చున్నప్పుడు మీకు ఎంత మానసిక ఒత్తిడి కలుగుతుందో.. అంతే ఒత్తిడి మీ స్మార్ట్ ఫోన్లో ఆలస్యంగా స్ట్రీమ్ అవుతున్న వీడియో చూస్తున్నప్పుడు కలుగుతోందని తాజా పరిశోధనలో తేలింది. స్ట్రీమింగ్ వీడియో ఆరు సెకన్లు ఆలస్యంగా ప్లే అయితే.. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఎదుర్కునేంత ఆందోళన, అర్థరాత్రి ఒంటరిగా హారర్ సినిమా చూస్తున్నప్పుడు కలిగే ఒత్తడి కలుగుతోందని స్వీడన్ కు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ ఎరిక్సన్ వెల్లడించింది. వీడియో ఒకసారి మొదలైన తరువాత మధ్యలో ఆగిపోతే ఈ ఒత్తిడి ఇంకా పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది.
స్మార్ట్ ఫోన్లలో లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు చూసే సమయంలో అవి లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్త పడాలని ఎరిక్సన్ తన నివేదికలో తెలిపింది. వెబ్ పేజీలు, వీడియోలు లోడ్ కావడంలో జరిగే ఆలస్యంతో వినియోగదారుల హార్ట్ రేట్ 38 శాతం పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. నెట్ వర్క్ ఆపరేటర్లు సైతం ఈ ఆలస్యం మూలంగా భారీగా వినియోగదారులను కోల్పోవాల్సివస్తుందని ఎరిక్ సన్ వెల్లడించింది.