మట్టి మహత్యం... బ్యాక్టీరియా నాశనం
బురదమట్టిని ఒళ్లంతా పూసుకోవడం ఓ చికిత్స పద్ధతన్నది మీకు తెలుసు. ఇలా చేస్తే చర్మరోగాలు పోతాయంటారు. దీని సంగతి ఏమోగానీ... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సూపర్‌బగ్ బ్యాక్టీరియాను కిసమీత్ బంకమట్టితో నాశనం చేయవచ్చునని యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు అంటున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో సహజసిద్ధంగా లభించే ఈ మట్టి నిమోనియా, స్కెప్టెసీమిమా వంటి వ్యాధులకు కారణమవుతున్న బ్యాక్టీరియాతోపాటు యాంటీబయాటిక్‌లకు లొంగని ఎంఆర్‌ఎస్‌ఏ బ్యాక్టీరియా చంపేస్తుందని, మొత్తం 16 రకాల బ్యాక్టీరియాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుందని తేల్చారు.
కెనడాలోని వాంకోవర్ ప్రాంతంలోని స్థానిక తెగల ప్రజలు ఈ బంకమట్టిని యుగాలుగా కొన్ని వ్యాధుల చికిత్సలో వాడుతున్నారు. 1940 నుంచి వైద్యులు ఈ మట్టిని కాలిన గాయాలు, అల్సర్ల చికిత్సకు వాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. యాంటీబయాటిక్‌ల రాకతో మరుగున పడిన ఈ వైద్యవిధానం తాజా పరిశోధనలతో మళ్లీ ప్రాముఖ్యత సంతరించుకుంది. అనేక ఖనిజాలు, బ్యాక్టీరియాలతో కూడిన కిసమీత్ మట్టిపై మరిన్ని పరిశోధనలు జరిపి సరికొత్త యాంటీ బయాటిక్‌లను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.