అమెరికాలో టోర్నడోల బీభత్సం
17 మంది మృతి..వేలాది ఇళ్లు, చెట్లు నేలమట్టం
వాషింగ్టన్: దక్షిణ మధ్య అమెరికాలో టోర్నడోలు ఆదివారం బీభత్సం సృష్టించాయి. ఆర్కాన్సస్, ఓక్లహామా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రచండ వేగంతో గాలులు సుడులు తిరుగుతూ వేలాది ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలను నేలమట్టం చేసి 17 మందిని కబళించాయి. సుడిగాలుల తీవ్రతకు చాలా చోట్ల కార్లు, ఇతర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆర్కాన్సస్‌లోని విలోనియా పట్టణంలో 15 మంది మృతిచెందగా ఓక్లహామాలోని లిటిల్ రాక్, పరిసర ప్రాంతాల్లో మరో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. సహాయ చర్యలను పూర్తి స్థాయిలో చేపడుతున్నట్లు చెప్పారు. సుమారు 15 వేల మంది ప్రజలు అంధకారంలో మగ్గుతున్నట్లు వివరించారు. ఓక్లహామాలోని మేఫ్లవర్ పట్టణంలోనూ చాలా ఇళ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మేఫ్లవర్ ప్రాంతం మీదుగా వెళ్లే ఇంటర్‌స్టేట్ 40వ హైవేపై శిథిలాలు భారీగా పేరుకుపోవడంతో ఆ రహదారిని తాత్కాలికంగా మూసేశారు.
బంగ్లాదేశ్‌లో గాలివానకు 16 మంది మృతి
బంగ్లాదేశ్‌లోని నోత్రోకోనా జిల్లాలో శనివారం రాత్రి కురిసిన భారీ గాలి వానకు 16 మంది మృతిచెందారు. సుమారు వెయ్యి ఇళ్లు దెబ్బతినగా వేలాది చెట్లు నేలకూలాయి. పెను గాలుల్లో చిక్కుకున్న ఓ రైలుకు తృ టిలో పెను ప్రమాదం తప్పింది. వాయవ్య దినాజ్‌పూర్‌వైపు వెళ్తున్న ఓ ఇంటర్‌సిటీ రైలు జమునా నదిపై ఉన్న బంగబంధు వంతెన పై నుంచి వెళ్తూ గాలుల తీవ్రతకు పట్టాలు తప్పింది.