వాషింగ్టన్: కరోనా పేషెంట్లకు వైరస్‌ను చంపేసే రసాయనాలు ఎక్కించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను వ్యంగ్యపూరితంగా మాట్లాడానని.. రసాయనాలు ఇంజెక్ట్ చేసుకోవాలని ప్రజలకు ప్రోత్సహించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. మహమ్మారి కరోనా(కోవిడ్-19)తో అమెరికాలో వేలాది మంది మృత్యువాత పడుతున్న వేళ.. వైరస్‌ను నాశనం చేసేందుకు అతినీలలోహిత కిరణాలను రోగుల శరీరంలోకి పంపించాలంటూ ట్రంప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. శ్వేతసౌధంలో గురువారం విలేకరుల సమావేశంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం శాస్త్రవేత్తలు వైరస్‌పై చేసిన అధ్యయన ఫలితాలను ఆ శాఖ సహాయ మంత్రి బిల్ బ్రయాన్ వెల్లడిస్తున్న సమయంలో ట్రంప్ ఈ విధమైన అనుచిత సలహాలు ఇచ్చారు. (‘డబ్ల్యూహెచ్‌ఓ విఫలం’.. అమెరికా కీలక వ్యాఖ్యలు!)
‘‘సూర్యరశ్మి తీవ్రత, కెమికల్స్ ధాటికి వైరస్ నిముషాల్లోనే నశించిపోవడం చూస్తున్నాం. కాబట్టి కరోనా రోగుల ఊపిరి తిత్తుల్లోకి అల్ట్రావయోలెట్ కిరణాల్ని పంపించి వైరస్‌ను చంపలేమా ? ఈ విషయం గురించి ఆలోచించండి’అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రమాదకర సలహాలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక ఎడబాటు పాటించడం వంటి జాగ్రత్తలతో కరోనా వ్యాప్తిని అరికట్టగలమని.. వ్యాక్సిన్ కనుగొనేంత వరకు నివారణ ఒక్కటే మార్గమని పేర్కొంటున్నారు. అంతేగానీ ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలతో ప్రజలను గందరగోళంలో పడేయవద్దని హితవు పలికారు. (రసాయనాలు తాగించండి)
ఇక రసాయనాలు ఎక్కించుకునే విషయంపై మేరీల్యాండ్ రాష్ట్ర ఎమర్జెన్సీ విభాగానికి పెద్ద ఎత్తున కాల్స్ వచ్చాయంటూ ట్విటర్‌లో పేర్కొంది. అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు విపరీత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి సమావేశంలో విలేకరులు ట్రంప్ ముందు ఈ విషయాలు ప్రస్తావించగా.. ‘‘ అసలేం జరుగుతుందో చూడాలనే మీలాంటి రిపోర్టర్లతో నేను వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు చేశాను. అంతేగానీ రసాయనాలు ఎక్కించుకోమని ఎవరికీ చెప్పలేదు. ఆ అవకాశాలు ఉంటాయా అని అడిగాను అంతే’’ అని పేర్కొన్నారు. వీలైతే రసాయనాలు చేతి మీద రుద్దుకోవాలని మాత్రమే అన్నానంటూ మాట మార్చారు. కాగా గతంలోనూ తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ ట్రంప్ అనేకమార్లు మీడియాపై మండిపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment