‘ట్రంప’రితనం..!
► ట్వీటర్‌లో ట్రంప్ మరో తుంటరి చర్య
► హిల్లరీని గోల్ఫ్‌బాల్‌తో కొడుతున్నట్లుగా ఫొటో షేర్
వాషింగ్టన్: ట్వీటర్‌లో ఎప్పుడూ పలు విమర్శలు, వ్యాఖ్యానాలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్ వేదికగా మరో వివాదానికి తెరతీశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తనకు పోటీగా నిలిచిన హిల్లరీ క్లింటన్‌ను అవమానించేలా ఉన్న ఓ జీఐఎఫ్ (గ్రాఫిక్ ఇమేజరీ ఫార్మాట్) చిత్రాన్ని ఆయన రీట్వీట్ చేశారు. 2011లో హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉండగా విమానం ఎక్కుతున్న సమయంలో ట్రంప్ ఆమెను గోల్ఫ్‌బాల్‌తో కొడుతున్నట్లుగా, బాల్ తగిలి ఆమె కింద పడుతున్నట్లుగా ఈ చిత్రంలో ఉంది. ట్రంప్ చర్యపై పలువురు మండిపడుతున్నారు. ఆయన అధ్యక్ష పదవికి తగని వాడంటూ కొందరు ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు.
ఐరాసలో ప్రసంగిం చనున్న ట్రంప్
ట్రంప్ తొలిసారిగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో మంగళవారం ప్రసంగిం చనున్నారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు, సిరియాలో ఐసిస్ ప్రాబల్యం తదిత రాలపై ఆయన మాట్లాడతారు. ప్రసంగానికి ముందే వివిధ దేశాల ప్రతినిధులతో ట్రంప్ సమావేశమై ఐరాసలో సంస్కరణలు తీసుకురావడానికి మద్దతు కోరనున్నారు. భారత్ సహా అనేక ప్రధాన దేశాలు ఐరాసలో సంస్కరణలు తేవాలనీ, భద్రతా మండలిని విస్తరించాలని కోరుతుండటం తెలిసిందే. ప్రస్తుత ఐరాస సర్వసభ్య సమావేశం 72వది కాగా ఈసారి మొత్తం 172 అంశాలపై చర్చించనున్నారు. కాగా, తమ బాధలను ఐరాస దృష్టికి తీసుకొచ్చేందుకు కొందరు శరణార్థులు ట్రంప్ చిన్ననాటి ఇంటిని ఉపయోగించుకున్నారు.