జపాన్‌కు ట్రంప్ జై.. ‘నన్ను నమ్మండి’
టోక్యో: జపాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జై కొట్టారు. జపాన్ ప్రధాని షింజో అబేకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన చాలా ఉల్లాసంగా కబుర్లు చెబుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు 100శాతం తనకు సమ్మతమేనని చెప్పారు. ఇటీవల ఉత్తర కొరియా నాలుగు ఖండాంతర క్షిపణులను పరీక్షించిన విషయాన్ని కూడా వారిద్దరు చర్చించుకున్నట్లు మీడియా ప్రతినిధులకు అబే తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో భద్రతాపరమైన తీర్మానానికి విరుద్ధంగా ఉత్తర కొరియా వ్యవహరించిందని, ఇది ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా ఒప్పందానికి ఒక సవాలు అని ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చినట్లు అబే వివరించారు.
‘అమెరికా 100శాతం జపాన్‌తో కలిసి పనిచేస్తుందని డోనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్‌లో చెప్పారు. ఆయన చెప్పిన మాటల్ని మొత్తం జపాన్ ప్రజలకు తెలియజేయాలని నన్ను కోరారు. ఈ విషయంలో రెండో ఆలోచనే అవసరం లేదని, పూర్తి స్థాయిలో తనను నమ్మవచ్చని చెప్పారు. ప్రమాదం ఇప్పుడు కొత్త దశలోకి వచ్చిందని మేమిద్దరం అంగీకరించాం(ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో)’ అని అబే తెలిపారు.