పాక్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
సాక్షి, వాషింగ్టన్: పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తే ఇక ఎంతకాలం సహించబోమని హెచ్చరించారు. ఉగ్ర సంస్థలకు పాక్ స్వర్గధామంగా ఉండటంపై తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఆప్ఘన్‌లో అమెరికన్ ఆపరేషన్‌లో భాగస్వామిగా పాకిస్తాన్ ఎంతో లాభపడిందని, అయితే నేరస్తులు, క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పించడం ద్వారా పాక్ దెబ్బతింటుందని అన్నారు. ఉగ్రవాదులపై పాక్ కఠినవైఖరి అవలంభించని పక్షంలో ఆ దేశానికి అమెరికా అందించే సైనిక, ఇతర సాయాలు నిలిచిపోతాయని హెచ్చరించారు.
ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సహకరించడం ద్వారా పాకిస్తాన్‌కు తాము బిలియన్ డాలర్లును చెల్లిస్తున్నా తాము పోరాడుతున్న ఉగ్రవాదులకే అది ఆశ్రయం కల్పిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఊతమిచ్చే వైఖరిని పాక్ తక్షణమే స్వస్తిపలకాలని తేల్చిచెప్పారు. నాగరికత, శాంతి, సామరస్యాలు వెల్లివిరిసే సమాజం నెలకొనేందుకు పాకిస్తాన్ అంకింత కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
భారత్ మరింత చొరవ చూపాలి
ఆప్ఘనిస్తాన్‌లో సుస్థిరత నెలకొనేందుకు భారత్ అందించిన సహకారం మరువలేనిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికాతో వాణిజ్యం ద్వారా బిలియన్ డాలర్ల రాబడి పొందుతున్న భారత్... ఆఫ్ఘన్ విషయంలో ముఖ్యంగా ఆర్థిక చేయూత, అభివృద్ధి పరంగా మరింత సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ తమకు కీలక భద్రత, ఆర్థిక భాగస్వామి అని పేర్కొన్నారు. ట్రంప్ తమ దక్షిణాసియా విధానాన్ని వివరిస్తూ భారత్‌తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతమే తమకు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.