
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి ఝలక్ ఇచ్చారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం అంటూ పేర్కొన్నారు. తాలిబన్లకు ఇతర ఉగ్రవాదులకు పాక్ రక్షణ కల్పిస్తోందంటూ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాల జాబితాలో పాక్‌ను తొలి స్థానంలో ట్రంప్ చేర్చినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు. త్వరలో ఆయన అప్ఘనిస్థాన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. 'పాక్ చాలాకాలం నుంచి తాలిబన్‌లకు ఎంతోమంది ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇప్పుడు అలాంటి రోజులు ముగిశాయి. పాక్‌ను ట్రంప్ నోటీసులో చేర్చారు' అని పెన్స్ తెలిపారు.
'పాకిస్థాన్ ఎంతో కాలం నుంచి అమెరికా భాగస్వామ్యం ద్వారా లబ్ధిని పొందుతోంది. కానీ, మున్ముందు అలాంటివాటిని పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. తన పొరుగు దేశాలైన ఇండియా, అఫ్ఘనిస్థాన్‌పై తమ దేశంలోని వ్యతిరేక శక్తులను ఉపయోగించాలని చూస్తున్న పాక్‌ను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాంటివి ఇక ఆపేయాలి. ఇప్పటికే అప్ఘనిస్థాన్‌లో సరిహద్దులో 500 బలగాలను దింపాం. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారన్నది మాకు అసలు విషయమే కాదు.. మా అధ్యక్షుడు ఎంత సైన్యాన్ని ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారు. అందుకే పాక్ ఉగ్రవాదుల విషయంలో కఠినంగా ఉండాలి' అని పెన్స్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment