న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం ప్రియులు కొంత మంది ఎక్కువగా తాగడం, నిషేధం ఉన్నప్పటికీ తాగి కారు నడుపుకుంటూ పోవడం, మధ్యలో పోలీసులకు పట్టుపడడం తెల్సిందే. ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ సమీపంలో జనవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో రెనాల్ట్ క్లియో కారును నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్‌ను ఎంత తాగాడో చెక్ చేసిన మాంచెస్టర్ పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బ్రీత్ అనలైజర్‌లో వంద మిల్లీ లీటర్లకుగాను 196 ఎంజీ ఆల్కహాల్ ఉండడమే అందుకు కారణం.
ఇంగ్లండ్‌లో వంద ఎంఎల్‌కు 35 ఎంజీ ఆల్కహాల్‌ను మాత్రమే అనుమతిస్తారు. అలాంటిది అంతకు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ ఆల్కహాల్ తాగడం, కారు నడపడం చూసి పోలీసు అధికారులకే దిమ్మ తిరిగిపోయింది. ఆ తర్వాత కారు ముందు టైర్లను చూసిన ఆ అధికారులకు మూర్ఛ వచ్చినంత పనయింది. కారు ముందు రెండు చక్రాలకు టైర్లు లేకపోవడమే అందుకు కారణం. పీకలదాకా తాగి కారు నడిపిన సదరు కారు యజమాని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన ట్రాఫిక్ పోలీసు అధికారులు టైర్లు లేని నీలిరంగు రెనాల్ట్ క్లియో కారు చక్రాల ఫొటోలను తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా, ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతగా తాగాడు సరే, టైర్లు లేకుండా చక్రాలపై కారును ఎలా నడిపాడబ్బా? అంటూ నెటిజెన్లు విస్తుపోతున్నారు. అసలు ఆయన అదే తన కారని ఎలా గుర్తించారు? ఎలా స్టార్ట్ చేశారు? టైర్లు ఊడిపోయినప్పుడే కారు పల్టీ కొట్టాలికదా! అంటూ విస్తుపోతున్నవాళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment