ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తె
ఫిలిప్పీన్స్ నిరంకుశ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తె ఐరాస మానవహక్కుల సంఘం చీఫ్‌పై తిట్లవర్షం కురిపించారు. ‘వేశ్య కొడుకా.. నన్నే సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటావా?’ అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తానంటూ అత్యంత క్రూరంగా ద్యుతర్తె సాగిస్తున్న అణచివేతపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్యుతర్తె సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి.. మానసిక పరిస్థితిని బాగుపర్చుకోవాలని ఐరాస మానవహక్కుల సంఘం హైకమిషనర్ జీద్ రాడ్ అన్ హుస్సేన్ సూచించారు. ఐరాస ప్రతినిధులపై దుర్భాషలు ఆడితే.. తగిన బదులిస్తామని ఘాటుగా పేర్కొన్నారు.
జోర్డానియన్ రాజకుమారుడైన జీద్ వ్యాఖ్యలపై ద్యుతర్తె చిందులు తొక్కారు. ‘మీరు బాగున్నారు మేయర్.. మీకు తిట్టడం అంటే కొంచెం ఇష్టం’ అని సైక్రియాట్రిస్ట్ నాకు చెప్పాడు. జీద్ వ్యాఖ్యలపై స్పందించవద్దని కొంతమంది నాకు చెప్పారు. కానీ ప్రతీకారం తీర్చుకునేందుకు మాట్లాడుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు. జీద్ తలకాయలో మెదడు లేదని, అది ఉత్త బుర్ర అని తిట్టిపోశారు. ‘అవును, నేను పరుషంగా ఉంటాను. చాలా పరుషంగా ఉంటాను. ఇందులో నేనే చేసేదేమీ లేదు. నేను ప్రజల్ని చంపుతున్నానా? అవును నేను డ్రగ్స్ అమ్ముతున్న వారిని చంపేస్తున్నాను. దీనిని ఆపాలని నేను ఇంతకుముందే చెప్పాను’ అని ద్యుతర్తే మంగళవారం తెలిపారు. ‘నన్ను జైల్లో వేయగలమని మీరు అనుకుంటే.. మీరు కల కంటున్నట్టే’ అని మానవ హక్కుల సంఘాలను ఉద్దేశించి ద్యుతర్తే పేర్కొన్నారు.
దేశంలో పెరిగిపోయిన డ్రగ్స్ సంస్కృతిని ఆరునెలల్లో రూపుమాపుతానని 2016లో అధికారంలోకి వచ్చిన ద్యుతర్తే ప్రభుత్వం.. డ్రగ్స్ అణచివేతలో భాగంగా వందలమంది డీలర్లను, వేలమంది వినియోగదారులను హతమార్చింది. డ్రగ్స్ సేవిస్తున్నట్టు భావిస్తున్న 4,100 మందిని చంపేసినట్టు ఫిలిప్పీన్స్ పోలీసులు చెప్తుండగా.. అనధికారికంగా ఆ సంఖ్య మూడు రెట్లు అధికమని హక్కుల సంఘాలు చెప్తున్నాయి. ద్యుతర్తే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పౌరులను హతమారుస్తోందని, ఈ దుర్మార్గంపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని జీద్ గత నెలలో మండిపడ్డారు. ఐరాస ప్రతినిధిపై ద్యుతర్తె దుర్భాషలాడటాన్ని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment