జపాన్‌లో మరో భారీ భూకంపం, 13 మంది మృతి
రిక్టర్‌స్కేల్‌పై 7.2గా తీవ్రత కుమమొటోను మళ్లీ కుదిపేసిన భూకంపం
టోక్యో: జపాన్‌లోని కుమమొటో ప్రాంతాన్ని మరో భూకంపం కుదిపేసింది. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో శనివారం (స్థానిక సమయం) తెల్లవారుజామున 1.25 గంటలకు భూకంపం దక్షిణ జపాన్‌లోని కుమమొటోలో అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారికంగా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. మరో 760 మంది గాయపడ్డారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అక్కడ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మనిమా సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాల కింద 11మంది చిక్కుకున్నారని, అయితే వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది తెలియటం లేదన్నారు.
కాగా మీటరు ఎత్తువరకు సముద్రం ఎగిసిపడి ముందుకు రావచ్చంటూ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీచేసి గంట అనంతరం ఉపసంహరించుకుంది. తాము ఇళ్లల్లో చిక్కుపోయామని పలువురు మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. భూకంపం తర్వాత అనేక చిన్నపాటి ప్రకంపనలొచ్చాయి. ‘మషికి’ పట్టణంలో భారీ సంఖ్యలో అత్యవసర వాహనాల శబ్దాలు వినిపించాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం వివరాలు తెలియరాలేదు.
మషికి పట్టణంలోని టౌన్‌హాలు బయట రోడ్డుకు భారీ పగులు ఏర్పడింది. పలువురు బిల్డింగుల్లో చిక్కుకుని సాయం కోసం అర్థించారు. తాజా భూకంప కేంద్రం మొన్నటి భూకంప కేంద్రానికి ఆగ్నేయంలో 12 కి.మి దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూమికి 10కిలోమీటర్లలోతులో ఇది ఉంది. గురువారం కుమమొటోలో భూకంప సంభవించి 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.