మూతపడ్డ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లు
జపాన్ భూకంపం స్థానిక ఎలక్ట్రానిక్, ఆటో సంస్థలకు భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్ లో వరుసగా సంభంవించిన భూకంపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సోనీ... తయారీ కేంద్రాలను మూసివేసింది. దక్షిణ ద్వీపప్రాంతం క్యుషు.. కుమామోటోలో నెలకొన్న సోనీ ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో భూకంపం సంభవించడంతో తమ ప్లాంట్లలొ కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది.
యాపిల్ ఇంక్ సహా అనేక స్మార్ట్ ఫోన్ల తయారీదారులకోసం ఉత్పత్తి చేసే ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లను సోనీ తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. నాగసాకితోపాటు క్యుషులో ఉన్న తమ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఇంకా చెప్పలేమని ప్లే స్టేషన్ మేకర్ సోనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చే 'కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీ కండక్టర్' (సీఎంఓఎస్) ఇమేజ్ సెన్సార్లను క్యుషులోని సోనీ కేంద్రాల్లో తయారు చేస్తారు. ముఖ్యంగా యాపిల్ ఐ ఫోన్లలో వినియోగించే ఈ సెన్సార్లతో సోనీ.. 40 శాతం మార్కెట్ ను నియంత్రిస్తుంది. ప్రస్తుతం భూకంపంతో ప్లాంట్ల లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్లాంట్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో చెప్పలేమని సోనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము సప్లై నిలిపివేయడంవల్ల యాపిల్ వంటి కష్టమర్లపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్పలేమంటున్నారు. మార్చి 2011 లో ఉత్తర జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపం, సునామీ.. ప్రభావం జపాన్ లోని ఆటో సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. అప్పటినుంచీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి విధానాలను సవరించుకొని, భారీ నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నాయి.
ప్రస్తుతం భూకంపం ప్రభావంతో క్యుషులోని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు కూడా తాత్కాలికంగా తయారీని నిలిపివేశాయి. జపాన్ లోని సెమీకండక్టర్ల ఉత్పత్తి సుమారు 25 శాతం వరకూ క్యుషులోనే జరుగుతుంది. దీంతో సోనీతోపాటు క్యుషులో స్థానికంగా నెలకొన్నఅనేక కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని భూకంపం కారణంగా నిలిపివేశాయి. భూకంప నష్టాన్ని అంచనా వేసేవరకూ ఈ ప్లాంట్లు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపించడంలేదు. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు ప్రభావం అనేక ఆటో మేకర్ సంస్థలపైనా పడింది. దీంతో ఆయా కంపెనీలు కూడ ఉత్పత్తిని నిలిపివేశాయి. హోండా మోటార్ కంపెనీ కూడ తమ కుమామోటో మోటార్ సైకిల్ ప్లాంట్ లో నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తయారీని సోమవారం వరకూ నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే టయోటా మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్ లో పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ పరిస్థితిని ఆదివారం వరకూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది.