
పర్యావరణ ప్రియమైన ప్రయాణం..!
ఏథెన్స్: పెట్రోల్, డీజిల్ అవసరం లేదు... బ్యాటరీలో చార్జింగ్ ఉంటే చాలు, బ్యాటరీలో చార్జింగ్ కూడా లేకుండా పోతే...పైన ఉన్న సోలార్ ప్యానల్ రీచార్జితో నడుస్తుంది, సౌరశక్తి కూడా అందుబాటులో లేకుండా పోతే... వాహనంలోని మనుషులే శక్తిని సృష్టించుకోవచ్చు! పెడల్స్ తొక్కుతూ బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు... ఇలా మూడు ప్రత్యామ్నాయ వనరులతో నడిచే బండి ఇది. పేరు ‘సన్నీ క్లిస్ట్’. చూడటానికి ఆటోలా... లైట్‌వెయిట్ బాడీతో ఉండే ఈ వాహనం ఎలక్ట్రానిక్ బ్యాటరీ చార్జింగ్‌తో దాదాపు 70 కిలోమీటర్ల దూరం అవిరామంగా పయనిసిస్తుంది. ఆ దూరం పయనించే లోగా సమకూర్చుకునే సౌరశక్తితో మరో 50 కిలోమీటర్ల నడవగలదు.
ఎలక్ట్రికల్ బ్యాటరీ శక్తి, సౌరశక్తితో లభించిన పవర్ శూన్య స్థాయికి వచ్చినా ప్రత్యేక పెడల్ అమరిక వాహనాన్ని ముందుకు తీసుకెళ్లగలదు. వాహనంలో కూర్చున్న వారు పెడల్స్‌ను తొక్కితే బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. కొద్ది సేపు అలా కష్టపడితే పదిహేను కిలోమీటర్ల ప్రయాణానికి ఇంధనాన్ని సంపాదించినట్టే. ఇలా నడిపించుకోగల ఈ వాహనం ఎలాంటి కాలుష్యకారకం కాదు. వాతావరణంలోకి ఎలాంటి చెడు వాయువులనూ విడుదల చేయని అత్యుత్తమ వాహనం ఇది...అని అంటున్నారు దీని రూపకర్తలు. గ్రీస్ ఆటోమొబైల్ ఇంజనీర్లు ఈ వాహనాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఏథెన్స్ నగర శివారుల్లో తిరుగుతోంది. ఇప్పటికే యూరోపియన్ కాంపిటీషన్స్‌లో అవార్డులను కూడా అందుకున్న ఈ వాహనాన్ని పర్యావరణ ప్రేమికులకు కానుకగా అందిస్తామని అంటున్నారు రూపకర్తలు.