వాషింగ్టన్: భారతకాలమానం ప్రకారం గురువారం ఉదయం మధ్యదరా సముద్రంలో ఈజిప్ట ఎయిర్ విమానం కూలిపోవడానికి ఉగ్రవాదులే కారణమని యూఎస్ అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ అన్నారు. విమానం కూలిపోవడానికి గల కారణాలను ప్రధాన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇంకా అన్వేషించక ముందే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
మొత్తం 66 మంది ప్రయాణీకులతో పారిస్ నుంచి కైరోకు బయల్దేరిన ఈజిప్టు ఎయిర్ కు చెందిన ఏ320 కూలిపోయినట్లు తొలుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ ప్రకటించారు. ఇది ఉగ్రదాడి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ట్రంప్ ఇది టెర్రరిస్ట్ ల పనేనని అభిప్రాయపడ్డారు. విమానం ఆచూకీ కనిపించకుండా పోయిన కొన్ని గంటల తర్వాత ఓ గ్రీకు నౌక శకలాలు గమనించడంతో కూలిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం కన్నా టెర్రరిస్టు దాడిగానే కనిపిస్తోందని ఈజిప్టు విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు.