
ఈజిప్ట్‌లో ఐసిస్ నరమేధం
ఈజిప్టులోని టాంటా, అలెగ్జాండ్రియా నగరాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో 45 మంది మరణించారు. 119 మంది గాయపడ్డారు.
45 మంది మృతి ∙ 119 మందికి గాయాలు
కైరో: ఈజిప్టులోని టాంటా, అలెగ్జాండ్రియా నగరాల్లో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో 45 మంది మరణించారు. 119 మంది గాయపడ్డారు. తొలుత కైరోకు 120 కి.మీ. దూరంలో ఉన్న టాంటాలోని సెయింట్ జార్జి చర్చిలో బాంబు పేలుడు సంభవించింది. 27 మంది మృతిచెందగా, 78 మంది గాయపడ్డారు. ఈస్టర్‌కు ముందు వచ్చే ‘పామ్ సండే’ ప్రార్థనల సందర్భంగా కిక్కిరిసిన చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పదార్థాలను పెట్టి పేల్చినట్టు భద్రతా అధికారులు చెబుతున్నారు.
అయితే ఇది ఆత్మాహుతి దాడని మరికొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే అలెగ్జాండ్రియా మన్షియా జిల్లాలోని సెయింట్ మార్క్స్ ఆర్ధోడాక్స్ చర్చ్ వద్దకు పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. 18 మంది చనిపోగా, 41 మంది గాయపడ్డారు. ఉగ్రవాది చర్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గమనించిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు పోలీసులు మరణించారు. టాంటాలోని రహీమ్ మసీదులో రెండు బాంబులను భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేశారు. కాగా, ఈ దాడి తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. దాడుల్ని భారత ప్రధాని మోదీ ఖండించారు.