లండన్: వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పగిలిపోతే కలిగే ఆ బాధ వర్ణనాతీతం. త్వరలోనే ఈ బెంగ తీరనుంది. తక్కువ ధరలో.. ఫ్లెక్సిబుల్‌గా ఉండే స్మార్ట్‌ఫోన్స్ స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి. సిల్వర్, గ్రాఫీన్‌లతో పర్యావరణహిత స్క్రీన్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ స్క్రీన్‌లు తక్కువ విద్యుత్‌నే ఉపయోగించుకుంటాయని, ఇప్పుడున్న వాటికంటే వేగంగా స్పందిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న టచ్‌స్క్రీన్స్ తయారీలో వాడే ఇండియమ్ టిన్ ఆక్సైడ్ పెళుసుగా ఉండటంతోపాటు ధర కూడా ఎక్కువ.
అలాగే ఇండియమ్ చాలా అరుదైన లోహం, దీనివల్ల పర్యావరణానికి కూడా హాని జరుగుతుందని తెలిపారు. సిల్వర్ కూడా అధిక ధరకే లభిస్తున్నా.. సిల్వర్ నానోవైర్లను గ్రాఫీన్‌కు జతచేయడం ద్వారా తక్కువ ధరకే ఈ నూతన స్క్రీన్‌ను తయారు చేసినట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. ఇంతకుముందే సిల్వర్ నానోవైర్లను టచ్‌స్క్రీన్స్‌లో ఉపయోగించినా.. ఎవరూ గ్రాఫీన్‌తో తయారు చేయలేదని వర్సిటీ పరిశోధకులు డాల్టన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment