
ప్రపంచంలోనే డేంజరస్ వర్క్ ప్లేస్
అడిస్ అబాబా: కొండలు, గుట్టలు, మారుమూల ప్రదేశాల్లో కాయకష్టం చేయడం ఎంతో కష్టమని మనం అనుకుంటాం. కానీ మంటలు ఎగజిమ్ముతూ లావా ప్రవహించే అగ్ని పర్వతాల సరసన, వేడి వేడి ఆవిరిల మధ్య గంధకం కక్కే భూముల్లో పని చేయడం మరెంత కష్టం. ఇతియోపియాకు ఉత్తరానున్న డనాకిల్ డిప్రెషన్ అలాంటి స్థలమే మరి. ‘గేట్ వే ఆఫ్ హెల్’గా ముద్రపడిన ఆ ప్రదేశంలో కూడా వందలాది మంది కూలీలు కష్టించి పనిచేస్తున్నారు.
సముద్ర మట్టానికి 300 అడుగుల దిగువనున్న డనాకిల్‌లో ఉప్పుగనులు అపారంగా ఉన్నాయి. అక్కడ ఉష్ణోగ్రత సరాసరిగా 60 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 50 డిగ్రీలకన్నా ఎప్పుడూ తగ్గదు. భూమి నుంచి వేడి వేడి ఆవిరిలు ఉబికి వస్తుండగా, వాటి వేడికి చర్మం కాలిపోతున్నట్లు మంటపెడుతున్నా పొట్ట గడవడం కోసం పదుల సంఖ్యలో కూలీలు తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణంలోనే వారు గుడిసెలు వేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. వారు చతురస్రాకారంలో ఉప్పు గడ్డలను తవ్వి తీయడం, వాటిని ఒంటెలపై ఎక్కించి సమీపంలోని బర్హలే పట్టణంలోకి విక్రయానికి పంపించడం రోజువారి దినచర్య.
ఉప్పుగడ్డల ఆకారంబట్టి వాటిని సాల్ట్ టైల్స్ అని పిలుస్తున్నారు. భయంకర పరిస్థితుల్లో వారు పనిచేయడాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ మస్సిమో రుమీ ఇటీవల అక్కడికి వెళ్లి వారి ఫొటోలను తీశారు. ప్రపంచంలో ఇంతకన్నా భయంకర వర్క్‌ప్లేస్ లేదేమోనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తాను కాసేపు కూడా అక్కడి వేడిని తట్టుకోలేకపోయానని ఆయన చెప్పారు.
కఠినమైన వాతావరణంలో తాము కష్టపడి పనిచేయడం ఎంత కష్టమో, ఉప్పుటైల్స్‌ను ఒంటెలపైకి ఎక్కించి మూడు రోజులపాటు అగ్ని పర్వతాల సమీపం నుంచి ప్రయాణించడం అంతేకష్టమని అక్కడి కూలీలు తెలియజేశారు. తాము పొద్దంతా కష్టపడితే 200 ఉప్పు టైల్స్‌ను వెలికితీస్తామని, ఒక్కో టైల్‌కు తమకు 13 పెన్నీలు ముడుతుందని వారు చెప్పారు.