మా దేశం రావద్దు! | Examining Consequences Of Australia's 457 Visa Abolition: Centre | Sakshi
Sakshi News home page

మా దేశం రావద్దు!

Published Wed, Apr 19 2017 12:32 AM | Last Updated on Thu, Oct 4 2018 7:05 PM

మా దేశం రావద్దు! - Sakshi

మా దేశం రావద్దు!

విదేశీయులకు ఉద్యోగాలపై ఆంక్షలు పెడుతున్న పలు దేశాలు
ప్రపంచమే ఓ కుగ్రామమనే పురోభివృద్ధి దశ నుంచి తిరోగమనం మొదలైంది. మా దేశం మాకే... మా ఉద్యోగాలు మాకే అంటూ గిరికీసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికాలో ట్రంప్‌ ప్రచారంతో మొదలైన ఈ ధోరణిని రోజురోజుకి పెరుగుతోంది. ఫలితంగా భారతీయుల వీదేశీ కలలు చెదిరిపోతున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియా కూడా వలసలకు బ్రేక్‌ వేసే చర్యలు తీసుకుంది. తాత్కాలిక విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో పనిచేసుకునేందుకు అనుమతించే 457 వీసా ప్రోగ్రాంను స్థానికంగా నిరుద్యోగం పెరిగిందనే కారణంతో రద్దు చేసింది. ఇవి కాకుండా పొట్టచేతబట్టుకొని కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్న భారతీయ కార్మికులు సైతం ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలు మూతపడి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చోటేచేసుకుంటున్న మార్పులపై కథనం...

ఈసారి ‘కంగారు’ల వంతు
తాత్కాలిక విదేశీ ఉద్యోగులను అనుమతించే 457 వీసా రద్దు
విదేశీయులను అనుమతించే ఉద్యోగాల జాబితా భారీగా కుదింపు
⇒  నిబంధనలు కఠినతరం
⇒  ఆస్ట్రేలియాలో 95 వేల తాత్కాలిక ఉద్యోగులు
⇒  వీరిలో మెజారిటీ భారతీయులే


ఏం జరిగింది: ‘ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యం. అందుకే 457 వీసా ప్రోగ్రాంను రద్దు చేస్తున్నాం. స్థానికంగా అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పటికీ... తక్కువ వేతనం ఇచ్చి పనిచేయించుకోవచ్చనే ఉద్దేశంతో విదేశీయులను దీని కింద ఆస్ట్రేలియాకు తెస్తున్నారు. ఈ వీసా ప్రోగ్రాం విశ్వసనీయతను కోల్పోయింది. ఆస్ట్రేలియన్లకు రావాల్సిన ఉద్యోగాలను తన్నుకుపోవడానికి దీన్నొక పాస్‌పోర్ట్‌గా వాడుకోవడాన్ని మేము అనుమతించం’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్‌ టర్న్‌బుల్‌ మంగళవారం ప్రకటించారు.

457 వీసా అంటే: విస్తీర్ణపరంగా ఆస్ట్రేలియా చాలా పెద్దది. కానీ జనాభా 2.4 కోట్లు మాత్రమే. అందుకని వివిధ ఉద్యోగాలకు స్థానికంగా అర్హులైన అభ్యర్థులు లభించకపోతే... తాత్కాలిక విదేశీ ఉద్యోగులను తెచ్చుకునేందుకు అనుమతించేదే 457 వీసా. నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుంది. జాకీ నుంచి జడ్జి దాకా, డ్రైవర్‌ నుంచి పైలట్‌ దాకా, టైలర్‌ నుంచి టీవీ వ్యాఖ్యాత దాకా... 200 పైచిలుకు రకాలైన ఉద్యోగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో నుంచి దాదాపు 180 రకాల ఉద్యోగాలను తొలగించారు. బుధవారం నుంచే కొత్త విధానం అమలులోకి వస్తుంది.

మనపై ప్రభావం ఎంత: గత ఏడాది సెప్టెంబరు 30 నాటికి 457 వీసాపై ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేస్తున్నవారు 95,757 మంది కాగా వీరిలో అత్యధికులు భారతీయులే. తర్వాతి స్థానం బ్రిటన్, చైనాలది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉంటున్న వారిపై 457 వీసా రద్దు ప్రభావం ఉండదు. కానీ కొత్తగా ఆస్ట్రేలియాలో ఉద్యోగాల కోసం చూస్తున్న భారతీయ నిపుణులకు గడ్డుకాలమే.

ప్రధానాంశాలు:
నిబంధనలను కఠినతరం చేసి... రెండు రకాల కొత్త వీసాలను ప్రవేశపెట్టారు.
తాత్కాలిక ఉద్యోగ వీసాను రెండేళ్లకు పరిమితం చేశారు. ఆంగ్ల భాష తెలిసి ఉండాలి. పర్మినెంట్‌ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ వీసాపై వచ్చినవారు అనర్హులు.
నాలుగేళ్ల వీసాకు ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉండటం తప్పనిసరి. ఆయా రంగాల్లో మంచి నైపుణ్యం ఉన్నవారికి నాలుగేళ్ల వీసా జారీచేస్తారు.
రెండు కేటగిరీల్లోనూ మూడేళ్ల గత అనుభవం తప్పనిసరి.
⇒  అలాగే ఉద్యోగార్థి నేరచరిత్రను పరిశీలిస్తారు. ఇదివరకు ఇది ఉండేది కాదు.
స్థానికంగా పత్రికా ప్రకటనలు ఇచ్చి... ఎవరూ దొరకనపుడు మాత్రమే కంపెనీలు విదేశీ ఉద్యోగులకు స్పాన్సర్‌షిప్‌ కింద తెచ్చుకోవాలి.
దరఖాస్తు చేసే సమయానికి 45 ఏళ్ల లోపు వారై ఉండాలి.
⇒  వలస ఉద్యోగులకు నిబంధనల ప్రకారం కనిష్టంగా 53,900 డాలర్ల వార్షిక వేతనం చెల్లించాలి.


‘దడ’పుట్టిస్తున్న ట్రంప్‌
‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో అగ్రరాజ్యం అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్‌ ట్రంప్‌... వలసలపై కఠిన వైఖరితో అమెరికాలోని భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారు. అమెరికా ఏటా 65,000 హెచ్‌1–బీ వీసాలు జారీ చేస్తుండగా... ఇందులో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. హెచ్‌1– బీ దుర్వినియోగం అవుతోందని, దీన్ని అరికట్టాలని ట్రంప్‌ బృందం కృతనిశ్చయంతో ఉంది. దీంతో ఈ వీసాపై అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఎప్పుడే నిర్ణయం వెలువుడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక చూస్తే...

నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కింద వస్తున్నందున హెచ్‌1–బీ ఉన్నవారికి కనీస వేతనం రెట్టింపు చేయాలని, వార్షిక వేతనం 1,30,000 డాలర్లుగా నిర్ణయించాలని అమెరికా చట్టసభల్లో జనవరి నెలాఖర్లో బిల్లు పెట్టారు. టెక్‌ కంపెనీలకు ఇది పెనుభారమవుతుంది. భారతీయులను అమెరికాకు తీసుకెళ్లడం వారి లాభదాయకతపై ప్రభావం చూపుతుంది. ఇది ముఖ్యంగా అమెరికాలో చదువుకొంటున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులాంటిది. వారి డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోవడం ఖాయం. అమెరికాలో హెచ్‌1–బీ వీసాపై ఉంటున్న భారతీయులు 3.5 లక్షల మంది కాగా... వీరిలో తెలుగువారే 1.06 లక్షల మంది అని అంచనా.

హెచ్‌1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి ఒబామా 2015లో వీలు కల్పించారు. వీరికి హెచ్‌4 జారీచేశారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై ప్రభుత్వ వైఖరిని తెలపాల్సిందిగా కోర్టు మార్చి 8న కోరితే... ట్రంప్‌ సర్కారు 60 రోజుల గడువు అడిగింది. వీసా సంస్కరణలపై పనిచేస్తున్నందునే  సమయం కోరిందని... అమెరికన్ల ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తున్నందున హెచ్‌4కు ట్రంప్‌ సర్కారు సానుకూలంగా ఉండకపోవచ్చనే భయం భారతీయుల్లో నెలకొంది. ఇది కొన్ని వేల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తల్లకిందులు చేస్తుంది.

కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌ను ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగులుగా గుర్తించబోమని అమెరికా ఈ నెలారంభంలో వెల్లడించింది. ఈమేరకు హెచ్‌1–బీ నిబంధనల్లో మార్పులు చేసింది. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ను స్పాన్సర్‌చేసే కంపెనీ అతినికి ప్రత్యేక నైపుణ్యం ఉందని రుజువు చేయాల్సిందేనని నిబంధన పెట్టింది.

⇒  హెచ్‌1–బీ వీసా నిబంధనలను కఠినతరం చేయాల్సిందిగా ఫెడరల్‌ ఏజెన్సీలను కోరే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ మంగళవారం సంతకం చేయనున్నారు.

సుతిమెత్తగా మొత్తుతున్న సింగపూర్‌
సమగ్ర ఆర్థిక సహాకార ఒప్పందాన్ని సమీక్షించే విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో సింగపూర్‌ తమ ఉద్యోగాలు భారతీయులకు పోకుండా చూస్తోంది. 2016 జనవరి నుంచి భారతీయ ఐటీ కంపెనీలకు వీసాల జారీని నామమాత్రం చేసింది. పైగా ‘స్థానికులను కొంచెం చూడరూ...’ అంటూ కంపెనీలకు చెబుతోంది. దీనర్థం స్పష్టమని... ఉద్యోగాలు స్థానికులనే దక్కాలనేది సింగపూర్‌ ప్రభుత్వ అభిమతమని నాస్కామ్‌ అంటోంది. ఆసియావ్యాప్త కార్యకలాపాల నిమిత్తం భారత ఐటీ కంపెనీలు సింగపూర్‌ను కేంద్రంగా ఎంచుకొని పనిచేస్తున్నాయి. ఇప్పుడీ కంపెనీలు భారతీయ నిపుణులను తెచ్చుకోలేక... మరోచోటికి తరలిపోయే అంశాన్ని పరిశీలించాల్సి పరిస్థితి నెలకొంది.

బదిలీల కట్టడి ద్వారా బ్రిటన్‌
బ్రిటన్‌ ఏటా జారీ చేసే ‘కంపెనీ అంతర్గత బదిలీ’ (ఐసీటీ) వీసాల్లో 90 శాతం భారతీయ కంపెనీలకే దక్కుతున్నాయి. దీని మూలంగా బ్రిటన్‌లో నైపుణ్య కల్పనపై కంపెనీలు దృష్టి సారించడం లేదని, రెడీమేడ్‌గా భారత్‌లో అందుబాటులో ఉన్న వనరులను వాడుకోవడానికే మొగ్గుచూపుతున్నాయని నిర్ణయానికి వచ్చిన బ్రిటన్‌ 2016 నవంబరులో ఆంక్షలు పెట్టింది. అంతర్గత బదిలీపై భారత్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చే ఉద్యోగికి కనిష్ట వేతన పరిమితిని 30 వేల పౌండ్లకు పెంచింది. ఉద్యోగుల జీవితభాగస్వాములు లేదా తల్లిదండ్రులు రెండున్నరేళ్లకు మించి బ్రిటన్‌లో ఉండాలంటే... ఆంగ్లభాషపై పట్టును పరిక్షించే కొత్త టెస్టును ఉత్తీర్ణులు కావాల్సిందేననే నిబంధన తెచ్చింది.

గల్ఫ్‌ గోస...
అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఆయిల్‌పైనే ఆధారపడ్డ సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. పలు పెద్ద కంపెనీలతో పెద్ద సంఖ్యలో చిన్న కంపెనీలు మూతపడటంతో ఉపాధి కరువై, జీతాలు రాక తెలుగు కార్మికులు వెనుదిరుగుతున్నారు. ఏడాది కాలంలో రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది తెలుగు కార్మికులు వెనక్కివచ్చారు. కువైట్‌లో కూడా పరిస్థితి బాగాలేదు. పర్యాటకంపై ఆధారపడ్డ యూఏఈలో కొంతవరకు ఫరవాలేదు. మొత్తం మీద గల్ఫ్‌ దేశాల నుంచి ఏడాది కాలంలో 80 వేల మంది కార్మికులు భారత్‌కు తిరిగివచ్చారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement