భూకంపం బలాదూర్.. చిన్నారి సేఫ్
భూకంపం ధాటికి పెద్దపెద్ద భవనాలు కూడా కుప్పకూలిపోతాయి. అందులోనూ జపాన్ లాంటి దేశాల్లో భూకంపాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ ఇంట్లో ఉన్నవాళ్లు ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం. కానీ, గురువారం రాత్రి జపాన్‌లో సంభవించిన భూకంపం బారి నుంచి ఎనిమిది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శకలాలను తొలగిస్తున్న రెస్క్యూ టీంకు ఓ చిన్నారి కనిపించింది. భూకంప ప్రభావంతో మషీకీలో కూలిపోయిన ఓ ఇంటి శకలాలను తొలగిస్తుండగా 8 నెలల అమ్మాయిని సిబ్బంది బయటకు తీశారు. అంత భూకంపం వచ్చి, ఇల్లు కూలిపోయినా.. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జపాన్ దక్షిణ ప్రాంతంలో సంభవించి భారీ భూకంపదాటికి ఇప్పటి వరకు 9 మంది మృతిచెందగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9.26 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటలకు) కమమొటో పరిధిలోని మషీకీ పట్టణంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.5గా నమోదైనట్లు జపాన్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. భూకంపంపై జపాన్ ప్రధానమంత్రి షింజో అబే స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.