
నచ్చినవారి ముఖాలే పాస్‌వర్డ్‌లు!
ప్రేమలో విఫలమైన చాలామంది తమ మాజీ ప్రేయసీ, ప్రియులను మరవలేక వారి పేర్లను పిల్లలకు పెట్టుకోవడమో, కంప్యూటర్, ఫోన్లు, తదితర వాటికి పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవడమో చేస్తారట
ప్రేమలో విఫలమైన చాలామంది తమ మాజీ ప్రేయసీ, ప్రియులను మరవలేక వారి పేర్లను పిల్లలకు పెట్టుకోవడమో, కంప్యూటర్, ఫోన్లు, తదితర వాటికి పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవడమో చేస్తారట. అయితే మనకు బాగా ఇష్టమైన, మనకు మాత్రమే బాగా తెలిసినవారి ముఖాలను కూడా ఇకపై సంకేతపదాలుగా పెట్టుకోవచ్చంటున్నారు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్ మనస్తత్వ శాస్త్రవేత్తలు. అనేకమంది ఫొటోల మధ్య బాగా పరిచయం ఉన్నవారి ఫొటోలను అస్పష్టంగా ఉన్నా మనుషులు ఇట్టే గుర్తుపట్టగలరని, అదే అంతగా పరిచయం లేనివారైతే అస్సలు గుర్తుపట్టలేరని పలు పరిశోధనల్లో తేలింది. దీని ఆధారంగా రూపొందించే ‘ఫేస్‌లాక్’ వ్యవస్థతో బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ఫేస్‌లాక్ వ్యవస్థలో మనకు మాత్రమే బాగా తెలిసినవారి ఫొటోలను అప్‌లోడ్ చేస్తే.. కొన్ని సిరీస్‌లతో ఫొటో గ్రిడ్స్ తయారవుతాయని, ఒక్కో గ్రిడ్‌లో తెలిసినవారి ఫొటోను గుర్తిస్తూ పోతే అదే పాస్‌వర్డ్ అవుతుందని అంటున్నారు. ఈ పాస్‌వర్డ్ సిరీస్‌లుగా ఉంటుంది కాబట్టి.. అన్ని గ్రిడ్లలో అన్ని ఫొటోలను గుర్తించడం ఇతరులెవ రికీ సాధ్యం కాదంటున్నారు. మనకు ఇష్టమైనవారి ముఖాలే సంకేతపదాలు కాబట్టి.. అంకెలు, అక్షరాల మాదిరిగా వీటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమూ ఉండదన్నమాట. వీరి పరిశోధన వివరాలు ‘పీర్‌జే’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.