అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక ఫొటో గ్రాఫర్ ఎంతమందికి తెలుసు? గతంలో తెలిసినా తెలవకపోయినా ఇప్పుడు మాత్రం తప్పకుండా గుర్తిస్తారు..
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక ఫొటో గ్రాఫర్ ఎంతమందికి తెలుసు? గతంలో తెలిసినా తెలవకపోయినా ఇప్పుడు మాత్రం తప్పకుండా గుర్తిస్తారు.. ఎందుకంటే ఒబామా దిగిపోయేవేళ ఆయన అందించిన చిత్రాలు అంత అద్భుతంగా వచ్చాయి. చివరిసారి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన చిత్రాలు చూస్తే కచ్చితంగా భావోద్వేగానికి లోనవ్వక తప్పదు. తన బాధ్యతలు ముగించుకొని తిరిగి వెళిపోతున్న ఒబామా ఫొటోలను అద్భుతంగా ఆలోచన కలిగించేలా తీసి ఔరా అనిపించారు.
బరాక్ ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిదేళ్ల కిందటి నుంచే పిటి సౌజా అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అంతకుముందే నాలుగేళ్ల పరిచయం ఆయనకు ఒబామాతో ఉంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఒబామా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన చిత్రాలు ఇప్పటి వరకు ఆయన 20లక్షల(రెండు మిలియన్ల) ఫొటోలు క్లిక్ మనిపించారట.
ఇప్పటివరకు వైట్‌హౌస్‌కు అత్యధిక కాలం ఫొటోగ్రాఫర్‌గా చేసిన వ్యక్తి కూడా ఈయనే. ఒబామాకు అత్యంత ఆప్తుడిగా వ్యవహరించిన సౌజా ఒబామా ఓవల్ బంగ్లా నుంచి తిరిగి వెళ్లిపోయే సమయంలో 'హెలికాప్టర్‌లో కూర్చుని విండోలో నుంచి కడసారిగా శ్వేతసౌదం వైపు గగనతలం నుంచి చూస్తున్న ఫొటో, హెలికాప్టర్ ఎక్కుతున్న ఫొటో, ఓవల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోతున్న, బయటకొస్తున్న ఫొటోలు క్లిక్ మనిపించి తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు.