జైల్లో ఖైదీల మధ్య జరిగిన గ్యాంగ్ వార్‌లో 10 మంది హత్యకు గురయ్యారు.
రియో డీజెనిరో: జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్‌లో 10 మంది హత్యకు గురయ్యారు. బ్రెజిల్‌లోని రియో గ్రాండే డొ నార్టెలో గల అల్కాకుజ్ జైలులో జరిగిన ఈ పాశవిక ఘటనలో ముగ్గురు ఖైదీల తలలను ప్రత్యర్థులు వేరు చేశారని అధికారులు వెల్లడించారు.
అల్కాకుజ్ జైలులో శనివారం మధ్యాహ్నం అల్లర్లు మొదలైనట్లు స్థానిక న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. కొంతమంది దుండగులు.. ప్రత్యర్థుల బ్యారక్‌లపై దాడి చేసి హతమార్చారని జైళ్ల కొఆర్డినేటర్ జెమిల్టన్ సిల్వా వెల్లడించారు. ఘటన జరిగిన జైలును పోలీసులు చుట్టుముట్టి అన్ని దారులను మూసివేసినట్లు తెలిపారు. జైలు లోపల ఆయుధాలతో ఉన్న దుండగులను అదుపులోకి తీసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అల్కాకుజ్ జైలులో 620 మంది ఖైదీలను ఉంచడానికి సౌకర్యాలు ఉండగా.. ఇప్పుడు అక్కడ 1000 మందికి పైగా ఖైదీలున్నారు. 2015 నవంబర్‌లో కూడా ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి.