
ముక్కలుగా కోసి కిలోల లెక్కన అమ్మేసారు!
అరుదైన తిమింగలం సొరచేప(వేల్ షార్క్)ను వేటాడి చంపినందుకు ఇద్దరు మత్స్యకారులను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు.
అరుదైన తిమింగలం సొరచేప(వేల్ షార్క్)ను వేటాడి చంపినందుకు ఇద్దరు మత్స్యకారులను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్నేయ చైనాలో గ్వాంగ్జీ ప్రావిన్స్ లోని బీహయ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆన్ లైన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు స్పందించారు. అంతరించిపోతున్న వేల్ షార్క్ ను వేటాడినందుకు లియొ, హునాగ్ అనే ఇంటి పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నిందితులు సొరచేప వేటాడి, దాని ముక్కలుగా చేసి కిలో రూ. 375కు అమ్మినట్టు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది. చచ్చిపోయిన భారీ సొరచేపను క్రేన్ సహాయంతో ట్రాలీలోకి ఎక్కించి, తరలిస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. మనిషి దురాశకు అమాయక జలచరం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరుదైన భారీ సొరచేపను వేటాడి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని గళమెత్తారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
అయితే సముద్రంతో చచ్చిపడున్న సొరచేపనే తాము బయటకు తీశామని పోలీసులతో నిందితులు చెప్పారు. వేల్ షార్క్ ను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచుర్ అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది. దీనిని వేటాడడాన్ని నిషేధించింది. పొరపాటున వలలో చిక్కినా వదిలివేయాలి.