క్వెట్టా: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. కల్లోలిత బెలూచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలోని ఓ చర్చిపై ఆత్మాహుతి బంబార్లు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. 20మందికిపైగా గాయపడినట్టు సమాచారం అందుతోంది.
క్వెట్టా నగరంలోని జార్ఘూన్ రోడ్డులో ఉన్న బెథెల్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చి లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఆత్మాహుతి బాంబర్లు చర్చిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ ఆత్మాహుతి బాంబర్‌ను గేటు వద్దే భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో బాంబర్ చర్చి ప్రాంగణంలోకి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు జరగాల్సిన ప్రాంతంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. చర్చిలో మరికొంత ఉగ్రవాదులు నక్కి ఉండొచ్చునని భావిస్తున్నామని, ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా ఆపరేషన్ కొనసాగుతున్నదని బెలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మీడియాకు తెలిపారు. ఆదివారం కావడంతో సహజంగా ఇక్కడి చర్చిలో 300 నుంచి 400 మంది ప్రార్థనలకు వస్తారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment