భారీ వర్షాలకు 112 మంది మృతి
బీజింగ్: చైనాను వర్షాలు ముంచెత్తాయి. వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో 112 మంది మృతి చెందగా.. 91 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతం హిబీ ప్రావిన్సులో వర్ష బీభత్సానికి 72 మంది మృతి చెందగా.. 78 మంది గల్లంతయ్యారు. ఈ ప్రాంతంలోని మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. జింటాయ్లోని డాక్సిన్ గ్రామంలో గ్రామస్తులు నిద్రలో ఉండగా అర్ధరాత్రి సంభవించిన ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.
జింగ్జింగ్ కౌంటీలో కేవలం 19 గంటల వ్యవధిలో 545 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదలకు రవాణా సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఇందుకోసం 105 మిలియన్ యువాన్లను కేటాయించింది. విద్యుత్, ఇతర సౌకర్యాలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.