నాలుగు గంటల్లో చంద్రుడి వద్దకు!
‘వార్ప్ డ్రైవ్’ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన నాసా
హైదరాబాద్: అందాల చందమామ మనకు ఇక పక్క ఊరి చుట్టం కాబోతున్నాడు! భూమికి దాదాపు 3.84 లక్షల కి.మీ దూరంలోని జాబిల్లి వద్దకు మనల్ని కేవలం నాలుగు గంటల్లోనే తీసుకె ళ్లి దిగబెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అభివృద్ధి చేస్తోంది. ప్రయోగాల్లో భాగంగా ఆ సంస్థ ‘కాంతివేగాన్ని అందుకునే స్థాయిలో’(వార్ప్ డ్రైవ్) వెళ్లే ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూక్ష్మతరంగాల ఒత్తిడి, సౌరవిద్యుత్‌తో పనిచేసే ఈ విధానం సాకారమైతే రోదసీ ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. టన్నుల కొద్దీ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన కష్టం తప్పుతుంది. రాకెట్లు, వ్యోమనౌకలు కాంతివేగం స్థాయిలో రోదసిలోకి దూసుకెళ్లగలవు. ఉపగ్రహాల సైజు కూడా సగానికి సగం తగ్గుతుంది.!
పనిచేసేది ఇలా..
- మూసేసిన కంటైనర్‌లో సూక్ష్మతరంగాల(మైక్రోవేవ్)లతో ఒత్తిడి కలగజేస్తారు. దీంతో వ్యోమనౌక దూసుకెళ్తుంది.
- సూక్ష్మతరంగాలకు సౌర విద్యుత్ అందుతుంది కనుక వేరే ఇంధనం అవసరముండదు.
- ఎలక్ట్రోమేగ్నటిక్ డ్రైవ్(ఈఎం డ్రైవ్) వ్యవస్థ ద్వారా విద్యుత్ శక్తిని ఒత్తిడిగా మారుస్తారు.
- భౌతికశాస్త్ర సూత్రం ప్రకారం.. ఏదైనా కదలాలంటే బాహ్య చోదక శక్తి కావాలి. అందుకే రాకెట్లకు ప్రొపెలెంట్లను అమరుస్తారు. ఈఎం డ్రైవ్‌లో ప్రొపెలెంట్ల అవసరం ఉండదు.
- శూన్యం ఆవరించి ఉండే అంతరిక్షంలో ఈ విధానం పనిచేయదని శాస్త్రవేత్తలు ఇదివరకు భావించారు. అయితే సాసా శూన్యంలో జరిపిన పరీక్షలో ఇది సాధ్యమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దానిపై నాసా ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.
- లండన్‌కు చెందిన శాస్త్రవేత్త రోగర్ సాయెర్ 2009లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. చైనా శాస్త్రవేత్తల బృందం మాత్రం 2009లో ఈ విధానం ద్వారా 72 గ్రాముల ఒత్తిడిని సృష్టించిందని వార్తలు వచ్చాయి.