
చెత్తేరుతున్న తల్లికి కాళ్లు మొక్కిన ‘బ్యూటీ క్వీన్’
నెత్తిన ధగధగలాడే కిరీటం, నడుముకు సిల్కు పట్టా, హైహీల్స్ తొడిగిన ఓ 17 ఏళ్ల సుందరాంగి....రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చెత్తేరుకుంటున్న ఓ మహిళ వద్దకు వెళ్లి
బ్యాంకాక్: నెత్తిన ధగధగలాడే కిరీటం, భుజాల మీదుగా నడుముకు సిల్కు పట్టా, హైహీల్స్ తొడిగిన ఓ 17 ఏళ్ల సుందరాంగి....రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చెత్తేరుకుంటున్న ఓ మహిళ వద్దకు వెళ్లి హఠాత్తుగా మోకాళ్లను నేలకానించి వంగి ఆమె పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించింది. ఆమె వెన్నంటే వచ్చిన మీడియా ఫొటోగ్రాఫర్ ఒకరు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు. ఇప్పుడా ఫోటో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఆ సుందరాంగి పేరు కనిత్తా మింట్ ఫాసేంజ్. ఆమె ‘మిస్ అన్‌సెన్సార్డ్ న్యూస్ థాయ్‌లాండ్-2015’ పేరిట జరిగిన అందాల పోటీలో టైటిల్ గెలుచుకొంది. ఆమె కాళ్లు మొక్కింది ఎవరికోకాదు, తనను కనీపెంచి ఇంతటిదాన్ని చేసిన తల్లికే.
వీధి వీధి తిరుగుతూ చెత్తను సేకరించి, దాన్ని రీసైక్లింగ్‌కు పంపించడం తన తల్లి చేస్తున్న వృత్తిని, చిన్నప్పటి నుంచి తనను ఎంతో కష్టపడి పెంచడమే కాకుండా డిగ్రీ వరకు చదివించిందని ఫాసేంజ్ గర్వగా చెప్పుకున్నారు. చేస్తున్న వృత్తి పట్ల తన తల్లికిగాని, తనకుగానీ ఏనాడు చులకన భావం కలగలేదని ఆమె చెప్పారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఇంకా పై చదువులకు వెళ్లలేని పరిస్థితుల్లో అనుకోకుండా సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన అందాల పోటీల్లో తనకు అవకాశం లభించిందని ఆమె వివరించారు.
డిగ్రీ పూర్తి చేసిన ఫాసేంజ్, అందాల పోటీకి ముందు తాను కూడా వీధి వీధి తిరుగుతూ చెత్తేరడంలో తల్లికి సహకరిస్తూ వచ్చారు. తన చిన్నప్పుడే తండ్రి నుంచి తల్లి విడాకులు తీసుకోవడంతో తామిద్దరమే ఒకరికొకరు తోడుగా బతుకుతున్నామని తెలిపారు. సినిమాల్లో నటించేందుకు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనకు ఇప్పుడు బోలడన్ని అవకాశాలు వచ్చాయని, తనతోపాటు తన తల్లిని నగరానికి తీసుకెళ్లి ఆమెకు మంచి విశ్రాంత జీవితాన్ని కల్పించాలన్నది తన తాపత్రయం ఆని ఆమె చెప్పారు. అయితే అందుకు తల్లి ఒప్పుకోవడం లేదని, ఇంతకాలం తిండిపెట్టిన వృత్తినే ఓపికున్నంత కాలం చేస్తానని చెబుతోందని అన్నారు.