జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో (ఫైల్ ఫోటో)
కోవిడ్-19 (కరోనా వైరస్) ఆటో ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ విస్తరించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ 6 ఖండాల్లో తన ఉనికిని చాటుకుని మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అసాధారణమైన చర్యగా 1,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, మార్చి 15 వతేదీ వరకు ఈ నిషేధం అమల్లో వుంటుందని తెలిపింది.
దీంతో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. ఆటో పరిశ్రమకు ప్రధానమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దయిందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. "90వ జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో-2020 జరగదు" అని జెనీవా ప్రాంతీయ కంటోనల్ ప్రభుత్వ అధినేత ఆంటోనియో హోడ్జర్స్ ట్విటర్‌లో వెల్లడించారు. మరోమూడు రోజుల్లో ఆటో షోలో ప్రధాన వేడుక ప్రారంభం కానుండగా తాజా నిర్ణయం వెలువడింది. ఈ పరిస్థితికి చింతిస్తున్నామనీ, కానీ ఆటో షో పాల్గొనే వారందరి ఆరోగ్యమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఫౌండేషన్ బోర్డు చైర్మన్ మారిస్ తురెట్టిని తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టిన తయారీదారులకు ఈ నిర్ణయం విపరీతమైన నష్టమే అయినప‍్పటికీ, అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. (కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!)
ఈ కార్ షో వచ్చే వారం (మార్చి5 -15) ప్రారంభం కానుంది. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు కార్ షోలో తాము పాల్గొడంలేదని ఇప్పటికే ప్రకటించాయి. అలాగే హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తన సందర‍్శనను రద్దు చేసుకున్నారు. ప్రయాణ ఆంక్షలు, కరోనావైరస్ వ్యాప్తి భయాలు బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఫ్రాంక్‌ఫర్ట్లో జరగనున్న లైట్ , బిల్డింగ్ ఫెయిర్ , బీజింగ్ ఆటో షోతో సహాపలు ముఖ్యకార్యక్రమాలను వాయిదా లేదా రద్దుకు కారణమయ్యాయి. కాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారి కరోనావైరస్‌కు సంబంధించి మూడు ఖండాల్లోని దేశాలు మొదటి కేసులను శుక్రవారం నివేదించాయి. స్విట్జర్లాండ్‌లో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య 15కి పెరిగిందని, 100 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని ప్రభుత్వ మంత్రి అలైన్ బెర్సెట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment