ఫేస్బుక్లో ఫోటోలు.. తల్లిదండ్రులపై కూతురు కేసు
ఫేస్బుక్లో ఫోటోలు.. తల్లిదండ్రులపై కూతురు కేసు
Published Fri, Sep 16 2016 3:57 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
వియన్నా: ఫోటోలు తీయడమే ఆలస్యం సోషల్ మీడియాలో ఉంచడం ఇటీవలి కాలంలో ఓ అలవాటుగా మారింది. కొందరైతే కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసమే పనిగట్టుకొని కొన్ని పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల(చివరికి సొంత పిల్లలు) ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచేవారు కూడా ఇకనుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది ఈ ఉదంతం.
తన అనుమతి లేకుండా.. కనీసం తన మనోభావాలను పట్టించుకోకుండా తన చిన్ననాటి ఫోటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారని ఆస్ట్రియాలో ఓ 18 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై కేసుపెట్టింది. తనకు సంబంధించిన సుమారు 500 ఫోటోలను 2009 నుంచి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు వాటిని తొలగించడానికి వారు నిరాకరించారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. ఆ ఫోటోలు 700 మంది ఫ్రెండ్స్కు షేరయ్యాయని.. అందులో అభ్యంతరకరమైన, తన మనోభావాలను దెబ్బతీసే ఫోటోలు సైతం ఉన్నాయని ఆ యువతి వెల్లడించింది.
'కనీసం నేను టాయ్లెట్లో ఉన్నానా లేక నగ్నంగా బెడ్పై ఉన్నానా అనే విచక్షణ లేకుండా నా బాల్యానికి సంబంధించిన ఫోటోలను పబ్లిక్లో ఉంచారు' అని సదరు యువతి వాపోయింది. తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడం హక్కు అనే భావనలొ తన తండ్రి ఉన్నారని ఆమె వెల్లడించింది. ఈ కేసు నవంబర్లో విచారణకు రానుంది. సోషల్ మీడియాలో ఇతరుల వ్యక్తిగత ఫోటోలు, సమాచారాన్ని ఉంచడం పట్ల ఆస్ట్రియాలో కఠినమైన చట్టాలే ఉన్నాయి. అయితే ఈ కేసులో తల్లిదండ్రుల నుంచి యువతికి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉందని యువతి తరఫు లాయర్ వెల్లడించారు.
ఫ్రాన్స్లో అయితే ఇతరుల ఫోటోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచురిస్తే.. 45 వేల యూరోల వరకు జరిమానా పాటు ఏడాది జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. తమ పిల్లల ఫోటోలను వందలకొద్ది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.
Advertisement