ప్రియుడిని వదిలించుకునేందుకు.. | The girlfriend plan to get rid of the Boy friend | Sakshi
Sakshi News home page

ప్రియుడిని వదిలించుకునేందుకు..

Published Sun, Mar 17 2019 3:07 AM | Last Updated on Sun, Mar 17 2019 1:59 PM

The girlfriend plan to get rid of the Boy friend - Sakshi

‘ప్రేమలోపడటం చాలా ఈజీ కానీ.. వదిలించుకోవడమే చాలా కష్టం గురూ..’ఈ మాట చాలా మంది అంటుంటారు. అది ఎంతవరకు నిజమో కానీ.. చైనాకు చెందిన ఓ మహిళకు మాత్రం చాలా కష్టంగా తోచింది. తాను ప్రేమిస్తున్న వ్యక్తిని ఎలాగైనా వదిలించుకోవాలని భారీ ప్లాన్‌ వేసింది. ఏకంగా తాను చనిపోయినట్లు ప్రకటించుకుంది. సెంట్రల్‌ చైనాలోని హుబీ ప్రావిన్స్‌.. వుహాన్‌ అనే పట్టణానికి చెందిన 37 ఏళ్ల యూ అనే మహిళకు పెళ్లయింది. కానీ వారిద్దరికీ విడాకులు అయ్యాయి. ఆ తర్వాత లిన్‌ అనే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అతడికి పెద్దగా ఆస్తిపాస్తులు లేవని గ్రహించిన ఆమె.. అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. అదే విషయం ఊరికే చెబితే అతడు ఒప్పుకోడేమోనని చాలా ఆలోచించి పెద్ద ప్లాన్‌ వేసింది. అదేంటంటే తన మాజీ భర్త తనను కిడ్నాప్‌ చేశాడని లిన్‌కు ఓ రోజు ఫోన్‌ చేసి చెప్పింది.

పోలీసులకు చెప్పొద్దని, వారికి చెబితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఎస్‌ఎంఎస్‌లలో పేర్కొనేది. ఆ తర్వాత కొద్ది రోజులకు తనను చంపేశాడని, తన శవాన్ని ఓ చెరువులో పడేశాడని లిన్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. దీంతో భయపడిపోయిన లిన్‌ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. మెసేజీలు వచ్చిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆమె ఉన్న స్థలాన్ని గుర్తించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. చనిపోయిందని భావిస్తున్న యూ అక్కడి ఓ హోటల్‌లో ఎంచక్కా బెడ్‌పై పడుకుని టీవీ చూస్తోంది. బిత్తరపోయిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తన బాయ్‌ఫ్రెండ్‌ పేదవాడని ఇటీవలే తెలిసిందని, దీంతో అతడిని వదిలించుకునేందుకు ఈ ప్లాన్‌ వేశానని చక్కగా వివరించింది. ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా.. కటకటాలపాలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement