ఈ ముద్దు గుమ్మల పేరిట డబ్బు దాచారు
పనామా: పన్నుపోటులేని స్వర్గసీమగా వాసికెక్కిన పనామాలో వందల కోట్ల రూపాయల నల్లడబ్బును దాచుకున్న వివిధ రంగాల ప్రముఖుల గుట్టురట్టవుతున్న విషయం తెలిసిందే. వీరిలో సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలతోపాటు దేశాధినేతలు కూడా తమ భార్యల పేరిట నల్లడబ్బును దాచుకున్నారు. కొంత మంది ప్రేయసిల పేరిట కూడా డబ్బుదాచారు.
అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్‌హామ్ అలయేవ్ భార్య షాంపేన్ లవింగ్ సోషలైట్ మెహ్రిబాన్ అలియేవ పేరిట, గినియా అధ్యక్షుడు మమాడి టూర్ భార్య లాన్యానా కాంట్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ భార్య, ప్రొఫెషనల్ ఐస్ డేన్సర్ తతియాన నావ్కా, ఐస్‌లాండ్ ప్రధాన మంత్రి సిక్‌ముందర్ డేవిడ్ భార్య అన్నా సికుర్లాగ్ పేరిట కోట్లాది రూపాయల నల్లడబ్బును దాచారు. భార్య నుంచి విడాకులు పొందే సమయంలో ఈ డబ్బు భార్యకు దక్కకుండా భర్త తన పేరు మీదకు మార్చుకునే వెసలుబాటును కూడా న్యాయ సహాయక సంస్థ మొసాక్ ఫోన్సేకా కల్పిస్తోంది. దీనికి చేయాల్సిందల్లా విడాకులు తీసుకోవాలనుకున్న సమయంలో భర్త చిన్న దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రేయసి పేరు మీదున్న సొమ్మును కూడా బదిలీ చేసుకునే అవకాశం ట్రస్టుల ద్వారా కల్పిస్తుండడంతో ఎక్కువ మంది ప్రముఖులు ప్రేయసిల పేరుతో కూడా నల్ల డబ్బు ఖాతాలను తెరిచారు.